Karnataka | బెంగళూరు, మార్చి 23: కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ 40 మంది ఎమ్మెల్యేలతో కలిసి తమ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఒకవేళ బీజేపీ గనుక గేట్లు తెరిస్తే.. బీజేపీలో చేరేందుకు ఆయన ఇప్పటికే రంగం సిద్ధం చేసుకొన్నారంటూ ఎమ్మెల్యే మునిరత్న చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. అయితే శివకుమార్‌ను పార్టీలోకి తీసుకొనేందుకు తమ పార్టీ నేతలు సుముఖంగా లేరని ఆయన చెప్పుకొచ్చారు. ‘బీజేపీ నేతలు కాంగ్రెస్‌లోకి వస్తున్నారని శివకుమార్ పైకి చెబుతున్నారు. అయితే వాస్తవం ఏంటంటే, తన అనుచరులతో కలిసి ఆయనే బీజేపీలోకి చేరేందుకు రెడీగా ఉన్నారు’ అని మునిరత్న పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో మరో నాలుగు డిప్యూటీ ముఖ్యమంత్రుల పోస్టులు సృష్టించాలనే డిమాండ్ ఉన్నదని, ఈ ప్రతిపాదనలపై అసంతృప్తిగా ఉన్న డీకే శివకుమార్ కాంగ్రెస్‌లో ఉండటం కంటే, బీజేపీలోకి వెళ్లడం మేలనే భావనలో ఉన్నారని ఆయన అన్నారు.
ఒక్కో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు 50 కోట్లు ఆఫర్: సిద్ధరామయ్య
బీజేపీపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యేలను పావులుగా వాడుకోవాలని బీజేపీ కుట్రలు పన్నుతున్నదని, ఇందుకోసం ఒక్కో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఆ పార్టీ రూ.50 కోట్లు ఆఫర్ చేసిందని ఆరోపించారు. బెంగళూరులో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ రణదీప్ సూర్జేవాలాతో కలిసి ఆయన పాల్గొన్నారు. అవినీతికి ‘పితామహులు’ బీజేపీ నాయకులని, దేశంలో ప్రజాస్వామ్య విధానాలను, పార్లమెంట్ వ్యవస్థను వారు ధ్వంసం చేస్తున్నన్నారని సిద్ధరామయ్య మండిపడ్డారు. ‘కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ప్రభుత్వాన్ని కూల్చాలన్నది బీజేపీ ప్లాన్. డబ్బుతోపాటు రాజీనామా చేసిన తర్వాత వచ్చే ఉప ఎన్నికలకు అయ్యే ఖర్చును కూడా తామే భరిస్తామని హామీ ఇస్తున్నది. ఇదంతా చేయడానికి బీజేపీకి కొన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇది నల్ల డబ్బు కాదా?’ అని ఆయన ప్రశ్నించారు. డీకే శివకుమార్ మాట్లాడుతూ తమ పార్టీ విరాళాల డబ్బును ఐటీ విభాగం స్తంభింపజేయడం ద్వారా ప్రతిపక్ష పార్టీలను మోదీ సర్కార్ టార్గెట్ చేసిందని ఆరోపించారు.