బెంగళూరు: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో పదవి కోసం పోరాటం సాగుతున్న నేపథ్యంలో తనకేమీ వద్దని, తానేమీ తొందరపడడం లేదని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ శుక్రవారం స్పష్టం చేశారు. అంగన్వాడీ స్వర్ణోత్సవం కార్యక్రమంలో సిద్ధరామయ్యతో కలసి పాల్గొన్న డీకే విలేకరులతో మాట్లాడుతూ ఢిల్లీకి వెళ్లి పార్టీ అధిష్ఠాన వర్గాన్ని కలుసుకుంటానని ఓ ప్రశ్నకు జవాబుగా తెలిపారు. అనేక అంశాల గురించి చర్చించడానికి తాను, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కలసి అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
ఢిల్లీలో పార్టీ అధిష్ఠానాన్ని కలుసుకుంటారా అన్న ప్రశ్నకు ఢిల్లీ మాకు ఆలయం. మేమందరం అక్కడకు వెళ్లాల్సిందే. ఢిల్లీ లేకుండా ఏమీ జరగదు. పార్టీ మమ్మల్ని మార్గదర్శనం చేస్తూనే ఉంటుంది అని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ విధానాలను కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయిస్తుందని ఆయన చెప్పారు. పార్టీ నుంచి ఎప్పుడు పిలుపు వచ్చినా తాను, ముఖ్యమంత్రి ఇద్దరం వెళతామని ఆయన తెలిపారు. తాజా రాజకీయ పరిణామాలపై వొక్కలిగ స్వామీజీలు మనస్తాపం చెందినట్లు కనపడుతోందని విలేకరులు చెప్పగా దీనికి కులం కోణం తాను అంటించదలచుకోలేదని డీకే చెప్పారు.