DK Shivakumar | బెంగళూరు : బెంగళూరు రోడ్ల సమస్యను దేవుడు కూడా పరిష్కరించలేడని కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ పేర్కొన్నారు. గురువారం బెంగళూరులో ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నగరంలో రోడ్లు, ట్రాఫిక్ దుస్థితిపై ఆయన స్పందిస్తూ.. ‘బెంగళూరులో 1.40 కోట్ల జనాభా, 1.10 కోట్ల వాహనాలు ఉన్నాయి. దేవుడే దిగివచ్చినా రెండుమూడేండ్లలో సమస్యను పరిష్కరించలేడు. ఇది చాలా కష్టమైనది. సరైన ప్రణాళికలు రూపొందించి, ప్రాజెక్టులు చేపట్టాల్సి ఉంది’ అని వ్యాఖ్యానించారు. డీకే వ్యాఖ్యలను హోంమంత్రి పరమేశ్వర సైతం సమర్థించారు. ‘బెంగళూరులో మౌలిక వసతుల కొరత ఉందని అందరికీ తెలుసు. ఇంతమంది జనాభా, వాహనాలకు తగ్గట్టుగా బెంగళూరు నిర్మాణం జరగలేదు. కొత్త మౌలిక సదుపాయాలు కల్పించనంతకాలం ట్రాఫిక్ అతిపెద్ద సవాల్‌గా ఉంటుంది’ అని పరమేశ్వర వ్యాఖ్యానించారు.
డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేత ఆర్ అశోక మండిపడ్డారు. ‘బెంగళూరు నగరాన్ని డీకే తన సొంత కోరికలకు నిధులు సమకూర్చే ఆవుగా భావిస్తారు. నగరంలో ప్రజా సమస్యలను పరిష్కరించే బాధ్యతను డీకే శివకుమార్ తీసుకోలేకపోతే పదవి నుంచి దిగిపోయి సమర్థులైన వారికి అప్పగించాలి’ అని అశోక ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. కర్ణాటకకు, బెంగళూరుకు కాంగ్రెస్ పార్టీ శాపంగా మారిందని, కాంగ్రెస్‌ను దించేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. బెంగళూరు అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులివ్వడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర ఆరోపించారు. డీకే వ్యాఖ్యలను ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ టీవీ మోహన్‌దాస్ సైతం తప్పుపట్టారు. వైఫల్యాన్ని అంగీకరించడం ఆశ్చర్యం కలిగించిందని, ఇది నాయకత్వ వైఫల్యమని ‘ఎక్స్’లో పేర్కొన్నారు.