న్యూఢిల్లీ, జనవరి 17: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ న్యూఢిల్లీలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ఖర్గేతో భేటీ అయ్యారు. దీంతో కర్ణాటకలో నాయకత్వ మార్పుపై సాగుతున్న ఊహాగానాలకు మరోసారి రెక్కలు వచ్చాయి. రాహుల్‌గాంధీతో ముఖాముఖీ చర్చలు జరిపిన శివకుమార్ అనంతరం ఖర్గేతో విడిగా సమావేశమైనట్లు వర్గాలు వెల్లడించాయి. చర్చల వివరాలను కాంగ్రెస్ పార్టీ అధికారికంగా వెల్లడించలేదు.
అయినప్పటికీ కర్ణాటకలో రాజకీయ పరిస్థితి, ప్రభుత్వంలో అంతర్గత సమన్వయం, నాయకత్వ మార్పుపై సాగుతున్న ఊహాగానాలపైనే ప్రధానంగా చర్చలు జరిగినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవల డీకే శివకుమార్ బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు, ఢిల్లీలో కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నాయకులు జరిపిన సమావేశాల నేపథ్యంలో జరిగిన భేటీలకు రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది. అయితే కర్ణాటక రాజకీయాలతోపాటు వివిధ రాష్ర్టాలలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన సంస్థాగత చర్చలలో కూడా డీకేఎస్ పాల్గొన్నారు. అదే సమయంలో కర్ణాటక ఇంధన మంత్రి కేజే జార్జి ఢిల్లీలో రాహుల్‌ను కలుసుకోవడం విశేషం