బెంగళూరు, అక్టోబర్ 24: కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో కుర్చీలాట కొనసాగుతున్నది. సీఎం పీఠంపై రోజురోజుకూ వివాదం ముదురుతున్నది. ఒక పక్క తానే ఐదేండ్లూ అధికారంలో ఉంటానని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటిస్తుండగా, ఆయనను సీఎం కుర్చీలోంచి తోసేసి ఆ పదవిని అధిష్ఠించాలని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఉవ్విళ్లూరుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర చేసిన ప్రకటన అలజడి సృష్టించగా, మరోసారి సీఎం పీఠంపై చర్చకు తెరలేచింది. తన తండ్రి, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రాజకీయ కెరీర్ ముగింపునకు వస్తున్నదని, మంత్రి సతీశ్ జార్కిహోళియే ఆయనకు తగిన వారసుడని, ఆయనే ఆ పదవికి తగిన వ్యక్తి అంటూ యతీంద్ర ప్రకటించడంపై డీకే వర్గం ఫైర్ అయ్యింది.
ముఖ్యమంత్రి పీఠంపై ఎవరిని కూర్చోబెట్టాలో నిర్ణయించేది సిద్ధూ కుటుంబం కాదని మండిపడ్డారు. యతీంద్ర చేసిన ప్రకటన కర్ణాటక కాంగ్రెస్‌లో తీవ్ర అలజడి సృష్టించింది. ఇప్పటికే నాయకత్వ మార్పు, అధికార పంపిణీ ఒప్పందాలపై పార్టీలో తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. సిద్ధరామయ్యను పదవి నుంచి తప్పించి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను ముఖ్యమంత్రిని చేస్తారని ఎప్పటి నుంచో ఊహాగానాలు వెలువడుతున్నాయి. దానిని డీకే కూడా ఖండించ లేదు. ఆయనకు మద్దతుగా ఆయన అనుచరులు కూడా సమయం వచ్చినప్పుడల్లా ఆయనను కాబోయే ముఖ్యమంత్రిగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.
మంత్రి జార్కిహోళి కాబోయే ముఖ్యమంత్రి అంటూ యతీంద్ర ప్రకటించడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే, డీకే మద్దతుదారుడు శివగంగ బసవరాజ్ గురువారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యతీంద్ర ప్రకటనను ‘పిల్లతనం’గా అభివర్ణించిన ఆయన, నాయకత్వాన్ని నిర్ణయించాల్సింది అధిష్ఠానమే తప్ప కుటుంబ సభ్యులు కాదని అన్నారు. ‘కాంగ్రెస్ పార్టీకి అధిష్ఠానం ఉంది. తమ వారసులను ఎంపిక చేసేందుకు ఇది మైసూర్ మహారాజా ఇల్లు కాదు. సీనియర్ నేత యతీ్రంద పిల్లతనంతో ఇలాంటి ప్రకటనలు చేయకూడదు. అయినా దీనిని మేము అంగీకరించడం లేదు. దీనిపై హైకమాండ్ చర్య తీసుకోవాలి’ అని బసవరాజు పేర్కొన్నారు.
యతీంద్ర వ్యాఖ్యలను హోం మంత్రి జీ పరమేశ్వర సమర్థిస్తూ తన మనసులో ఉన్నది యతీంద్ర ప్రకటించారని పేర్కొంటూ, అహింద ఉద్యమంలో జార్కిహోళి పాత్ర గురించి ప్రస్తావించారు. కర్ణాటక ముఖ్యమంత్రి పదవి గురించి యతీంద్ర ఎలాంటి ప్రకటనలు చేయలేదని మంత్రి సతీశ్ జార్కిహోళి స్పష్టం చేశారు. వెనుకబడిన తరగతులు, దళితులకు ప్రాతినిధ్యం వహించే అహింద సమాజాన్ని బలోపేతం లక్ష్యంగా ఉన్నాయని అన్నారు.
కర్ణాటకలో అధికార మార్పిడిపై జరుగుతున్న ఊహాగానాలపై ఎవరితో మాట్లాడాలో వారితోనే మాట్లాడుతానని డీకే శివకుమార్ స్పష్టం చేశారు. గతంలో ‘కర్ణాటక కాబోయే సీఎం డీకే శివకుమారే’ అంటూ వ్యాఖ్యలు చేసిన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హెచ్డీ రంగనాథన్, హెచ్ఏ ఇక్బాల్‌లకు కాంగ్రెస్ అధిష్ఠానం నోటీసులు జారీ చేసింది కదా? ఇప్పుడు అదే తరహాలో సీఎం కుమారుడు యతీంద్రకు కూడా నోటీసులు ఇస్తారా? అన్న ప్రశ్నకు డీకే స్పందిస్తూ ఈ విషయంలో ఇప్పుడు తానేమీ మాట్లాడలేనని, అయితే ఎవరితో మాట్లాడాలో వారితోనే దీనిపై మాట్లాడతానని సమాధానమిచ్చారు.