Divorce | ప్రతి మహిళ తాను తల్లి కావాలని కోరుకుంటుంది. కానీ, ఆ మహిళకు జీవితాంతం తోడు ఉంటానని పెండ్లాడిన వ్యక్తి.. ఆమె కల సాకారం చేయకపోగా, అర్ధంతరంగా విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్‌లో చోటు చేసుకున్నది. సదరు బాధితురాలు ఇదే అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అతడి వీర్య కణాలతో ఐవీఎఫ్ ప్రక్రియ ద్వారా తాను తల్లినయ్యేందుకు భర్త సహకారం కావాలని, అప్పటి వరకు తన భర్త దాఖలు చేసిన విడాకుల పిటిషన్ విచారణపై స్టే విధించాలని అభ్యర్థించింది. అలాగే తాను ప్రస్తుతం లక్నోలోని తన తల్లిదండ్రుల వద్ద జీవిస్తున్నందున సదరు విడాకుల కేసును లక్నోకు బదిలీ చేయాలని కూడా ఆమె కోరారు.
దీనిపై జస్టిస్ పంకజ్ మిథల్ సారధ్యంలోని సుప్రీంకోర్టు బెంచ్ ఈ నెల ఒకటో తేదీన విచారించింది. ‘భోపాల్‌లో ఇరు పక్షాల మధ్య పెండింగ్‌లో ఉంది. అదే సమయంలో పిటిషనర్ భార్య.. లక్నోలో నివసిస్తున్నందున ఈ విషయమై ఆరు వారాల్లో జవాబు ఇవ్వాలని పిటిషనర్‌కు నోటీసులు జారీ చేయాలని ఆదేశిస్తున్నాం’ అని సుప్రీంకోర్టు తెలిపారు. ‘భోపాల్‌లోని ఫ్యామిలీ కోర్టులో పెండింగ్‌లో ఉన్న పిటిషన్ విచారణపై స్టే విధిస్తున్నాం` అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
2017 నవంబర్‌లో వీరిద్దరికి పెండ్లి జరిగింది. పెండ్లయిన తర్వాత గానీ అతడికి ఏ ఉద్యోగం లేదని తెలియలేదు. దీంతో తనకు ఉద్యోగం వచ్చే వరకూ పిల్లల ఊసెత్త వద్దని తప్పించుకున్నాడు సదరు వ్యక్తి. పదేపదే అభ్యర్థించి తప్పించుకున్నాడు. నిత్యం ఒత్తిడి తేవడంతో ‘ఐవీఎఫ్ ఫర్టిలైజేషన్’ చికిత్సకు అంగీకరించాడు. వైద్యుల సలహాతో కొనసాగుతున్న చికిత్సను మధ్యలోనే వదిలేశాడు. తన భార్యతో సంబంధాలు తెగదెంపులు చేసుకుని విడాకుల పిటిసన్ వేశాడు.. ఆమె ఫోన్‌కాల్స్‌ను బ్లాక్ చేస్తూ భావోద్వేగ పూరితంగా వేధింపులకు గురి చేశాడని బాధితురాలు.. తన న్యాయవాది ఐశ్వర్య పాఠక్ ద్వారా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
సదరు వ్యక్తి ఆమెను బలవంతంగా ఇంటి నుంచి గెంటేయడంతో భోపాల్‌లో పలు సమస్యలను ఎదుర్కొన్న బాధితురాలు చివరకు లక్నోలో ఉన్న తన తల్లిదండ్రుల చెంతకు చేరుకున్నదని పిటిషన్లో వివరించారు. పెండ్లయిన తర్వాత తనకు ఉద్యోగం లేదని చెప్పిన సదరు వ్యక్తి.. మంచి జాబ్ దొరికే వరకూ తాత్కాలికంగా ఆమెను తన తల్లిదండ్రుల వద్ద ఉండమని సూచించాడని అభ్యర్థించినట్లు కూడా తెలిపారు. ఉద్యోగం దొరికిన తర్వాత పిల్లలకు జన్మనిద్దామని నమ్మ బలికాడని పేర్కొన్నారు. లక్నోకు విడాకుల పిటిషన్ బదిలీ చేయాలని కోరడంతోపాటు ఐవీఎఫ్ ప్రక్రియ ద్వారా తల్లినయ్యేందుకు వైద్యుల సలహా మేరకు వీర్య కణాలు ఇచ్చేందుకు తన భర్త సహకరించాలని బాధితురాలు కోరింది. ఐవీఎఫ్ ద్వారా తల్లి కావాలంటే 45 లేదా 46 ఏండ్ల లోపే ప్రయత్నించాలని వారికి వైద్యులు సలహా ఇచ్చారు. సదరు మహిళ వయస్సు 44 ఏండ్లు కావడం గమనార్హం.