జైపూర్, అక్టోబర్ 22: రాజస్థాన్ బీజేపీలో అసమ్మతి భగ్గుమంది. వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో టికెట్లు రాని పలువురు ఆశావహులు అధిష్ఠానం తీరుపై మండిపడ్డారు. పార్టీ కార్యాలయాలపై దాడి చేసి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. తర్వాత అక్కడ ఉన్న ఎన్నికల ప్రచార సామగ్రిని రోడ్‌పై వేసి టైర్లతో పాటు వాటిని దహనం చేశారు. ముఖ్యంగా చిట్టఘర్, ఉదయ్‌పూర్, కోట, జైపూర్, అళ్వార్, బూంది నియోజకవర్గాల్లో తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ దిష్టిబొమ్మలను దహనం చేశారు. వీరిలో కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండగా, మరికొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్ ఇవ్వడంపై నిరసన వ్యక్తం చేశారు.
రాజస్మండిలో టికెట్లు రాని బీజేపీ నేతలు దినేశ్ బదలా, గణేశ్ పలివాల్, మహేంద్ర కొఠారి తమ అనుచరులు, బీజేపీ కార్యాలయంలోని ఫర్నిచర్ ఇతర సామగ్రిని ధ్వంసం చేస్తూ, వాటిని రోడ్మీదకు విసిరేస్తూ బీభత్సం సృష్టించారు. అలాగే ఉదయ్‌పూర్ టికెట్‌ను అశించిన డిప్యూటీ మేయర్ పారస్ సింఘ్వీ, చిట్టఘర్లో సిట్టింగ్ ఎంఎల్ఏ చంద్రభన్ సింగ్ ఆఖ్యా, జైపూర్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే అశోక్ లాహోటి, కోటా సౌత్‌లో వికాశ్ శర్మ నిరసన తెలిపారు. ఇక బూందిలో అశోక్ డోగ్రాకు టికెట్ కేటాయింపుపై నిరసన వ్యక్తం అయ్యింది.