లక్నో: కిడ్నీ అమ్ముకున్న వ్యక్తికి రూ.50,000 తక్కువ చెల్లించడంపై వివాదం తలెత్తింది. దీంతో భారీ కిడ్నీ రాకెట్ గుట్టు రట్టయ్యింది. ఈ నేపథ్యంలో ఐదుగురు డాక్టర్లతో సహా ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరి కొందరు డాక్టర్ల కోసం వెతుకుతున్నారు. (Kidney Racket) ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ సంఘటన జరిగింది. బీహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన ఆయుష్, ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఎంబీఏ చదువుతున్నాడు. ఆర్థిక ఇబ్బందుల వల్ల కిడ్నీ రాకెట్ ట్రాప్‌లో అతడు పడ్డాడు. ఒక కిడ్నీని రూ.10 లక్షలకు అమ్ముకున్నాడు.
కాగా, ఆయుష్‌తో ఒప్పందం కుదుర్చుకున్న వ్యక్తులు అతడికి రూ.9.5 లక్షలు మాత్రమే చెల్లించారు. రూ.50,000 తక్కువగా చెల్లించి తనను మోసం చేయడంపై అతడు ఆగ్రహించాడు. పోలీసులకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాడు. ఈ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులున్న యువతను ట్రాప్ చేస్తున్న అంబులెన్స్ డ్రైవర్ శివం అగర్వాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని ప్రశ్నించడంతో కిడ్నీ రాకెట్ వ్యవహారం గురించి పోలీసులకు తెలిసింది.
మరోవైపు ముజఫర్‌నగర్‌కు చెందిన పారుల్ తోమర్ అనే రోగికి అత్యవసరంగా కిడ్నీ అవసరం కావడంతో ఆయుష్ అమ్ముకున్న కిడ్నీని ఆమెకు ట్రాన్స్‌ప్లాంట్ చేసినట్లు పోలీసులు తెలుసుకున్నారు. దీని కోసం ఆ మహిళ కుటుంబం నుంచి రూ. 60 లక్షలు వసూలు చేసినట్లు దర్యాప్తులో తెలిసింది.
ఈ మొత్తం సమాచారం ఆధారంగా పోలీసులు, ఆరోగ్య శాఖ అధికారులు సంయుక్తంగా రంగంలోకి దిగారు. సోమవారం రాత్రి కాన్పూర్‌లోని కళ్యాణ్పూర్ ప్రాంతంలో ఉన్న అహుజా హాస్పిటల్, ప్రియా హాస్పిటల్, మెడ్ లైఫ్ హాస్పిటల్‌పై రైడ్ చేశారు. రిజిస్ట్రేషన్ లేకుండా మెడ్ లైఫ్ ఆసుపత్రి పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఆ హాస్పిటలో ఉన్న ఆయుష్, పరుల్‌ను పోలీసులు రక్షించారు. ఆయుష్ పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు కిడ్నీ రాకెట్‌కు సంబంధించి అహుజా ఆసుపత్రి యజమాని డాక్టర్ సుర్జిత్ సింగ్ అహుజా, ఆయన భార్య డాక్టర్ ప్రీతి అహుజా, డాక్టర్ రాజేష్ కుమార్, డాక్టర్ రామ్ ప్రకాష్, డాక్టర్ నరేంద్ర సింగ్‌తో పాటు అంబులెన్స్ డ్రైవర్ శివం అగర్వాల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న కిడ్నీ రాకెట్ ప్రధాన సూత్రధారి డాక్టర్ అఫ్జల్, సర్జరీ బృందంలోని ప్రధాన వైద్యులైన డాక్టర్ రోహిత్, వైభవ్ అనురాగ్ కోసం పోలీసులు వెతుకుతున్నారు.
కాగా, ఈ అక్రమ కిడ్నీ రాకెట్ ముఠాకు కాన్పూర్‌లోనే కాకుండా ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, నేపాల్‌లో కూడా సంబంధాలున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. విదేశీయులతో సహా 40 నుంచి 50 వరకు అక్రమ అవయవ మార్పిడులు నిర్వహించినట్లు తెలిసిందన్నారు. మానవ అవయవ మార్పిడి చట్టం, బీఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ల కింద నిందితులపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
మరోవైపు రిజిస్ట్రేషన్ లేని మెడ్ లైఫ్ ఆసుపత్రిని ఆరోగ్య శాఖ అధికారులు సీల్ చేశారు. రూ. 1.75 లక్షల నగదు, పెద్ద మొత్తంలో నిషేధిత ప్రాణరక్షక మందులను స్వాధీనం చేసుకున్నారు. అహుజా ఆసుపత్రి, ప్రియా ఆసుపత్రి రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేసేందుకు చర్యలు ప్రారంభించినట్లు చీఫ్ మెడికల్ ఆఫీసర్ హరి దత్ నేమి తెలిపారు.
Also Read:
Man Dupes High Court Judge | హైకోర్టు న్యాయమూర్తిని ఆరు లక్షలకు మోసగించిన వ్యక్తి.. అరెస్ట్
Watch: రాత్రివేళ ఇంటి గోడలు దూకి.. మహిళల లోదుస్తులు దొంగిలిస్తున్న వ్యక్తి