NREGA | న్యూఢిల్లీ, మే 30: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ హయాంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నీరుగారుతున్నది. ఈ విషయాన్ని పలు సంస్థలు గణాంకాలతో సహా వెల్లడిస్తున్నాయి. దేశవ్యాప్తంగా గత రెండేండ్లలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి 8 కోట్ల మందికి పైగా కార్మికులను తొలగించినట్టు పౌర సమాజ సంఘాలు లిబ్టెక్ ఇండియా, ఎన్ఆర్ఈజీఏ సంఘర్ష్ మోర్చా మంగళవారం విడుదల చేసిన సంయుక్త నివేదిక పేర్కొన్నది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో స్కీమ్‌లోని మొత్తం నమోదిత కార్మికుల సంఖ్యలో 20.47 శాతం మందిని తొలగించారని, గత ఐదేండ్లలో ఇదే అత్యధికమని వెల్లడించింది.
మోదీ సర్కార్ అవలంబిస్తున్న ఆధార్ ఆధారిత చెల్లింపు(ఏబీపీఎస్) వంటి సాంకేతికత కేంద్రీకృత విధానాలు ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని లిబ్టెక్ ఇండియా సీనియర్ పరిశోధకులు రాహుల్ ముక్కెర పేర్కొన్నారు. అధికారులకు శిక్షణ ఇవ్వకుండా కొత్త సాంకేతికతను అమలు చేశారని, ఏబీపీఎస్ కోసం అధికారులకు లక్ష్యాలు పెట్టారని, గత రెండేండ్లలో 8 కోట్ల మంది కార్మికుల తొలగింపునకు ఇది కారణమైందన్నారు.
స్కీమ్ అమలులో మార్పులు, ప్రధానంగా మోదీ సర్కార్ తీసుకొచ్చిన ఆధునిక సాంకేతికత వినియోగం వలన గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఈ పరిస్థితి తలెత్తిందని నివేదిక పేర్కొన్నది. కేంద్ర బడ్జెట్లో ఏటికేటికి ఈ పథకానికి నిధులకు కోత పెడుతున్నారని, వేతనాల చెల్లింపులో జాప్యం చోటుచేసుకొంటున్నదని తెలిపింది.
