చెన్నై: తమిళనాడు సీఎం, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్‌పై ఆ పార్టీ మాజీ నేత ప్రతీకారం తీర్చుకున్నారు. కంచుకోట అయిన కొలత్తూరు స్థానంలో విజయ్‌కు చెందిన టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు గెలిచారు. స్టాలిన్ కంటే అధికంగా 9,192 ఓట్లు సాధించారు. (TVK’s VS Babu) 2011 ఎన్నికలకు ముందు జరిగిన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా కొలత్తూరు స్థానం కొత్తగా ఏర్పడింది.
ఆ సమయంలో డిప్యూటీ సీఎంగా ఉన్న స్టాలిన్ 2011 ఎన్నికల్లో కొత్తగా ఏర్పడిన కొలత్తూరు నుంచి తొలిసారి పోటీ చేశారు. ఏఐఏడీఎంకే అభ్యర్థి సైదై దురైసామిపై కేవలం 2,734 ఓట్ల స్వల్ప తేడాతో గెలుపొందారు. 2016 ఎన్నికల్లో ఏఐఏడీఎంకే అభ్యర్థి జేసీడీ ప్రభాకర్‌పై 37,730 మెజార్టీతో విజయం సాధించారు. అలాగే 2021 ఎన్నికలలో ఐఏఏడీఎంకే అభ్యర్థి ఆది రాజారామ్‌పై 70,384 ఓట్ల భారీ మెజారిటీతో స్థాలిన్ గెలిచారు. దీంతో మూడు వరుస విజయాలతో డీఎంకే కంచుకోటగా కొలత్తూరు స్థానం నిలిచింది.
కాగా, గతంలో థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు భారీ మెజారిటీతో గెలిచిన ఎంకే స్టాలిన్, 2011లో కొత్తగా ఏర్పడిన కొలత్తూరులో తొలిసారి పోటీ చేశారు. ఈ నేపథ్యంలో 2011 వరకు ఉత్తర చెన్నై జిల్లా డీఎంకే ఇన్చార్జిగా ఉన్న వీఎస్ బాబుకు, స్టాలిన్ ప్రచారాన్ని పర్యవేక్షించే అదనపు బాధ్యతను అప్పగించారు.
అయితే ఏఐఏడీఎంకే అభ్యర్థి సైదై దురైసామిపై కేవలం 2,734 ఓట్ల స్వల్ప తేడాతో అతికష్టంగా స్టాలిన్ గెలిచారు. ఇది వీఎస్ బాబుపై ప్రభావం చూపింది. దీంతో డీఎంకే ఆయనను పక్కనపెట్టింది. పార్టీ ఉత్తర చెన్నై జిల్లా అధ్యక్షుడిగా పీకే శేఖర్ బాబును ఆయన స్థానంలో నియమించింది. పార్టీ తీరుపై అసంతృప్తి చెందిన వీఎస్ బాబు 2016 జూన్‌లో డీఎంకేను వీడి ఏఐఏడీఎంకేలో చేరారు.
మరోవైపు 2026 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో విజయ్ ఏర్పాటు చేసిన టీవీకేలో వీఎస్ బాబు చేరారు. గతంలో డీఎంకేలో ఎదుర్కొన్న అవమానానికి ఆయన ప్రతీకారం తీర్చుకున్నారు. డీఎంకే కంచుకోట కొలత్తూరు స్థానంలో సీఎం స్టాలిన్‌పై పోటీ చేశారు. డీఎంకే చీఫ్ వరస విజయాలకు చెక్ పెట్టి ఆయనపై విజయం సాధించారు. టీవీకే చీఫ్ విజయ్ నమ్మకాన్ని వీఎస్ బాబు నిలబెట్టుకున్నారు.
Also Read:
Vijay’s manifesto | తమిళనాడులో ‘టీవీకే’ ప్రభంజనం.. విజయ్ ‘మేనిఫెస్టో’ కీలకం
S A Chandrasekhar | టీవీకేతో చేతులు కలపండి.. కాంగ్రెస్‌కు విజయ్ తండ్రి సూచన