ఢిల్లీ, జూలై 22: నీట్ పేపర్ లీకేజ్, చలో పార్లమెంట్ సందర్భంగా విద్యార్థులపై పోలీసుల చర్యను వ్యతిరేకిస్తూ విపక్షం బుధవారం కూడ నిరసనను కొనసాగించడంతో వరుసగా మూడోరోజు పార్లమెంట్ కార్యకలాపాలకు అవరోధం ఏర్పడింది. తాము డిమాండ్ చేస్తున్న అంశాలపై రాజ్యసభలో చర్చ ప్రారంభించడానికి ముందు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని షరతు విధించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇవ్వాలని కోరారు. నీట్ పేపర్ లీకేజ్ అంశంపై నిష్పాక్షిక చర్చ జరగాలంటే ముందుగా ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని ఖర్గే చెప్పారు. ఆయన రాజీనామా చేసేంత వరకు నిష్పాక్షికంగా చర్చ జరుగబోదని ఆయన అన్నారు. అయితే నీట్ పేపర్ లీకేజ్‌పై పార్లమెంట్లో చర్చకు ప్రభుత్వం సిద్ధమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం వర్షాకాల సమావేశాల ప్రారంభం రోజు నుంచి సిద్ధంగా ఉందని ఆయన అన్నారు.
అయితే అన్ని పార్టీలతో చర్చించిన తర్వాత చర్చకు సంబంధించిన సమయం, విధివిధానాలను చైర్మన్ ఖరారు చేయవలసి ఉంటుందని ఆయన చెప్పారు. చర్చకు సంబంధించి షరతులు విధించడం లేదా తప్పించుకోవాలని చూడడం తగదని రిజిజు అన్నారు. నీట్ అంశం, విద్యార్థుల భవిష్యత్తును పరిరక్షించేందుకు తీసుకున్న చర్యలపై చర్చించాలని ప్రభుత్వం భావిస్తున్నదని, సభాపతి అనుమతి లభించగానే చర్చను ప్రారంభించడానికి పూర్తిగా సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. కాగా, విపక్ష ఇండియా కూటమి ప్రవర్తన బాధ్యతారహితంగా ఉందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా రాజ్యసభలో విమర్శించారు. పార్లమెంటరీ హుందాతనాన్ని, ప్రజాస్వామిక విలువలను దిగజారుస్తున్నారని ఆయన ఆరోపించారు. కాగా గందరగోళం మధ్య పార్లమెంట్ ఉభయ సభలు గురువారానికి వాయిదా పడ్డాయి. కాగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం పట్టుపడుతున్న రాహుల్ గాంధీ, ఇతర విపక్ష ఎంపీలు బుధవారం నల్ల దుస్తులతో పార్లమెంట్‌కు హాజరయ్యారు.