న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: వివాదాస్పద వక్ఫ్(సవరణ) బిల్లుపై బుధవారం లోక్‌సభలో చర్చ జరగనున్నది. ఈ బిల్లును ఎట్టి పరిస్థితిలో ఇదే సమావేశంలో ఆమోదించాలని అధికార పక్షం భావిస్తుండగా రాజ్యాంగ విరుద్ధమైన ఈ బిల్లును సమైక్యంగా వ్యతిరేకించాలని ప్రతిపక్షాలు నిర్ణయించుకున్నాయి. స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన ప్రధాన పార్టీలకు చెందిన నాయకులతో కూడిన లోక్‌సభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) మంగళవారం సమావేశమై వక్ఫ్ బిల్లుపై 8 గంటలపాటు చర్చించాలని నిర్ణయించినట్టు మైనారిటీలు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు విలేకరులకు తెలిపారు. అవసరమైతే సమయాన్ని పొడిగించడానికి కూడా స్పీకర్ అంగీకరించినట్టు ఆయన చెప్పారు. ప్రభుత్వం తమ గొంతును నులిమివేస్తోందని ఆరోపిస్తూ కాంగ్రెస్‌తోపాటు ఇతర ఇండియా కూటమికి చెందిన పార్టీలు సమావేశం నుంచి వాకౌట్ చేయడంతో బుధవారం నాటి లోక్‌సభ సమావేశం వాడీవేడిగా సాగే అవకాశాలు కనపడుతున్నాయి.
10, 12 తరగతుల సీబీఎస్ఈ సిలబస్‌లో మార్పులు; గ్రేడింగ్‌లోనూ సవరణలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: సీబీఎస్ఈ 10, 12 తరగతుల సిలబస్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. నైపుణ్య ఆధారిత అభ్యాస అవకాశాలను పెంపొందించేలా ఈ మార్పులు చేశారు. కొత్త సిలబస్ ప్రకారం 10వ తరగతి విద్యార్థులు మూడు నైపుణ్య ఆధారిత సబ్జెక్టుల నుంచి తప్పనిసరిగా ఒకదానిని ఎంచుకోవాలి. అలాగే భాషా సబ్జెక్టులుగా విద్యార్థులు ఇంగ్లిష్ లేదా హిందీలలో ఒక దానిని తప్పక ఎంచుకోవాలి. ఇక కోర్ సబ్జెక్టులైన సైన్స్, గణితం, సోషల్ సైన్స్ లేదా లాంగ్వేజ్‌లలో విద్యార్థి ఫెయిలైతే తుది ఫలితాల గణన కోసం వారు దానిని ఉత్తీర్ణత సాధించిన నైపుణ్య సబ్జెక్టులు లేదా ఐచ్ఛిక భాషా సబ్జెక్టుతో భర్తీ చేసుకోవచ్చు. ఇక 12వ తరగతి విద్యార్థులకు అదనంగా కొత్త పాఠ్యాంశ ప్రణాళికలను జోడించారు. 10, 12 తరగతులకు సిలబస్‌తో పాటు వాటి గ్రేడింగ్ విధానం కూడా సవరించింది. మార్కులను గ్రేడ్లుగా మార్చే 9-పాయింట్ల గ్రేడింగ్ విధానాన్ని అమలు చేస్తుంది.