గాంధీనగర్ : ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో తరతరాలుగా దళితులపై కొనసాగుతున్న వివక్షకు ఎట్టకేలకు తెరపడింది. స్వాతంత్య్రానంతరం 78 సంవత్సరాల తర్వాత గుజరాత్‌లోని ఓ గ్రామంలో ఓ దళిత కుటుంబానికి తమ స్వగ్రామంలోనే క్షవరం చేయించుకునే అవకాశం లభించింది. బనాస్కాంఠా జిల్లాలోని అల్వాడా గ్రామంలో ఆగస్టు 7న ఈ చారిత్రాత్మక ఘటన చోటుచేసుకుంది. సామాజిక న్యాయం దిశగా తొలి అడుగు ఆ గ్రామంలో పడింది. 24 ఏళ్ల కీర్తి చౌబల్ అనే రైతు కూలీ స్థానిక సెలూన్లో క్షవరం చేయించుకున్నాడు. ఆ గ్రామంలోని సెలూన్లో ఓ దళితుడికి క్షవరం చేయడం ఇదే మొదటిసారి. ఈ సందర్భాన్ని ఓ విమోచన ఘట్టంగా గ్రామంలోని దళితులు అభివర్ణించారు. అల్వాడా గ్రామంలో సుమారు 6,500 మంది పౌరులు నివసిస్తుండగా అందులో 250 మంది వరకు దళితులు ఉంటారు.
తరతరాలుగా వీరికి గ్రామంలో క్షవరం చేయడానికి ఏ క్షురకుడు ఒప్పుకునేవాడు కాదు. దీంతో పక్క గ్రామాలకు వెళ్లి తమ కులాన్ని దాచిపెట్టి వీరు క్షవరం చేయించుకోవలసిన పరిస్థితి. ఈ వివక్షను స్వాతంత్య్రం పూర్వం నుంచి తమ పూర్వీకులు ఎదుర్కొన్నారని, తాను, ఇప్పుడు తనతోపాటు తన పిల్లలు కూడా ఈ వివక్షనే అనుభవిస్తున్నామని 58 ఏళ్ల ఛగాజీ చౌహాన్ అనే దళితుడు తెలిపాడు. స్థానిక సెలూన్లో క్షవరం చేయించుకోవడాన్ని ఓ సాహసోపేత, భావోద్వేగ క్షణంగా కీర్తి చౌహాన్ వర్ణించాడు. గత 24 ఏళ్లలో మొట్టమొదటిసారి తన సొంత గ్రామంలో క్షురకుడి చేత క్షవరం చేయించుకోగలిగానని, తన సొంత గ్రామం తనను తమవాడిగా అంగీకరించినట్లు ఉందని అతను చెప్పాడు. సామాజిక కార్యకర్త చేతన్ దాభీ కొంతకాలంగా దళితుల పట్ల వివక్షను అంతం చేయాలని అగ్రవర్ణాల వారికి నచ్చచెప్పే ప్రయత్నం సాగిస్తున్నారు. అయితే చర్చలు విఫలం కావడంతో పోలీసులు, జిల్లా యంత్రాంగం జోక్యం చేసుకుంది. గ్రామ పెద్దలతో చర్చించిన పోలీసు, జిల్లా అధికారులు ఎట్టకేలకు సమస్యను పరిష్కరించారు.
యూపీలోని మీరట్‌లో జరిగిన డ్రమ్ హత్య గుర్తుందా.. ఆ భయంకరమైన ఉదంతాన్ని గుర్తుకు తెచ్చేలా రాజస్థాన్‌లో మరో భార్య ఇదే తరహా హత్యకు పాల్పడింది. నెలన్నర క్రితం పరిచయమైన ప్రియుడి కోసం ముగ్గురు పిల్లల తల్లి కూడా అయిన ఆమె ఈ దారుణానికి ఒడిగట్టింది. భర్తను చంపి డ్రమ్ములో ఉప్పేసి పూడ్చిపెట్టింది. ఖైర్తాల్-తిజారా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 35 ఏండ్ల హన్స్‌రామ్ అలియాస్ సూరజ్, ఆయన భార్య సునీత, ముగ్గురు పిల్లలతో కిషన్గఢ్బాస్లో నెలన్నర క్రితం జితేంద్ర అనే వ్యక్తి ఇంట్లో అద్దెకు దిగాడు. భార్య మరణించడంతో 12 ఏండ్ల నుంచి జితేంద్ర తల్లితో ఉంటున్నాడు. ఇటుక బట్టీలో పనిచేసే సూరజ్‌తో బాగా పరిచయం పెంచుకున్న జితేంద్ర అతనితో మద్యం సేవించే వాడు. తర్వాత అతని భార్య సునీతకు దగ్గరవ్వడంతో ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది.
సోషల్ మీడియాలో రీల్స్ చేయడం సునీత, జితేంద్రలకు బాగా ఇష్టం. దీంతో సూరజ్‌ను అడ్డు తొలగించుకుంటే తామిద్దరం కలిసి రీల్స్ చేసుకుంటూ సంతోషంగా జీవించవచ్చునని భావించి అతడిని హత్య చేయడానికి నిర్ణయించారు. దీని కోసం సునీత.. నీళ్ల కోసం అంటూ జితేంద్ర తల్లి నుంచి ఒక నీలం డ్రమ్మును తీసుకువచ్చింది. జన్మాష్ఠమి రోజున భర్తను హత్య చేయాలని సునీత నిర్ణయించింది. అనుకున్న విధంగానే ఆ రోజు ప్రియుడు, ఆమె కలిసి భర్త గొంతు కోసి హత్య చేసి, శవం ఎవరికీ కనబడకుండా నీలం డ్రమ్ములో ఉంచి అందులో ఉప్పు వేసి దానిని ఇంటి డాబాపై పెట్టారు. మరునాడు దుర్వాసన రావడంతో జితేంద్ర తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వారు డాబాపై చూడగా, డ్రమ్ములో సూరజ్ మృతదేహం బయటపడింది. దీంతో సునీత, జితేంద్రలను పోలీసులు అరెస్ట్ చేశారు.