న్యూఢిల్లీ, జూలై 29: గత లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపులో తేడాలున్నట్టు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) సంస్థ సంచలన విషయం వెల్లడించింది. ఏకంగా 538 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్ల మధ్య వ్యత్యాసాలున్నట్టు తెలిపింది. లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌కు సంబంధించి తాము జరిపిన విశ్లేషణ వివరాలను ఏడీఆర్ సోమవారం మీడియాకు వెల్లడించింది. దేశంలో 362 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కన్నా మొత్తం 5,54,598 ఓట్లను తక్కువగా లెక్కించగా, 176 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కన్నా మొత్తం 35,093 ఓట్లను అధికంగా లెక్కించారని వెల్లడించింది. మొత్తం 5,89,691 ఓట్లు తేడా వచ్చినట్టు తెలిపింది. దీనిపై భారత ఎన్నికల సంఘం స్పందించాల్సి ఉంది. అలాగే తుది పోలింగ్ శాతం విడుదలలో ఎన్నికల సంఘం జరిపిన అసాధారణ జాప్యంపై ప్రజల్లో అనుమానాలు నెలకొన్నాయని ఏడీఆర్ వ్యవస్థాపకుడు జగదీప్ చోక్కర్ మీడియా సమావేశంలో తెలిపారు. అయితే ఈ వ్యత్యాసాల కారణంగా ఎన్ని నియోజకవర్గాల్లో ఫలితాలు తారుమారు అయ్యే అవకాశం ఉన్నదన్న విషయాన్ని ఆయన స్పష్టంచేయలేదు. ఈవీఎంలలో పోలైన, లెక్కించిన ఓట్ల మధ్య హెచ్చు తగ్గులు, కచ్చితంగా పోలైన ఓట్ల డాటా విడుదలలో అసాధారణ జాప్యం, ఎన్నికల సంఘం వెబ్సైట్ నుంచి కొంత డాటా తొలగించడం వంటివి పలు అనుమానాలకు తావిస్తున్నాయని ఆయన తెలిపారు.