Shashi Tharoor : ప్రధాని మోదీ (PM Modi) ని ప్రశంసిస్తూ కాంగ్రెస్ ఎంపీ (Congress MP) శశి థరూర్ (Shashi Tharoor) చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతల నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. ఆ విమర్శలపై థరూర్ పరోక్షంగా స్పందిస్తూ కాంగ్రెస్ నేతలకు చురకలు అంటించారు. ప్రతిఒక్కరూ ఎప్పడూ ఒకే సిద్ధాంతాలను పాటిస్తూ కేంద్రానికి సహకరించకపోతే పనులు జరగవని వ్యాఖ్యానించారు.
సైద్ధాంతిక స్వచ్ఛత దేశాన్ని ముందుకు తీసుకువెళ్లదని, సహకారమే ముందుకు తీసుకువెళ్తుందని అభిప్రాయపడ్డారు. ఎవరు అధికారంలోకి వచ్చినా వారితో కలిసి పని చేయాలని, చివరికి ప్రజలే గెలవాలి కానీ రాజకీయాలు కాదని అన్నారు. దుబాయ్‌లో జరిగిన ఒక మీడియా కార్యక్రమంలో థరూర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలు సిద్ధాంతాలపైన మాత్రమే ఆసక్తి చూపిస్తారని, కానీ మీరు ఆవిధంగా ఉండటంవల్ల చాలా పనులు చేయలేరని కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి అన్నారు.
‘ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ చెప్పిన అంశాలను నేను ప్రస్తావించాను కానీ, ఆయనను ప్రశంసించలేదు. అయినప్పటికీ నా వ్యాఖ్యలపై విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం మన దేశంలో ఇలాంటి వాతావరణమే ఉంది’ అని థరూర్ వ్యాఖ్యానించారు. కాగా ఇటీవల ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ప్రధాని మోదీ చేసిన ప్రసంగానికి కితాబిస్తూ థరూర్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. అభివృద్ధి కోసం భారత్ ఎంత తపనపడాలో, బ్రిటిష్ కాలంనాటి మనస్తత్వాన్ని ఎలా వీడాలో ప్రధాని మోదీ తన ప్రసంగంలో తెలిపారని ఆ పోస్టులో పేర్కొన్నారు.
ఎప్పుడూ ఎలక్షన్ మోడ్‌లో ఉంటానంటూ అందరూ తనను విమర్శిస్తారని మోదీ చెప్పారని, కానీ ప్రజల సమస్యల విషయంలో ఆయన ఎప్పుడూ ఎమోషనల్ మోడ్‌లో ఉంటారని థరూర్ రాసుకొచ్చారు. ఈ పోస్టుపై కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ తీవ్రంగా స్పందించారు. బీజేపీ సిద్ధాంతాలు నచ్చితే ఇంకా కాంగ్రెస్‌లోనే ఎందుకు కొనసాగుతున్నారని థరూర్‌ను ప్రశ్నించారు.