ముంబై: మహారాష్ట్రలోని పూణేలో మే 19న జరిగిన పోర్షే కారు ప్రమాదం కేసులో (Pune Porsche crash) పోలీస్ ఉన్నతాధికారికి ఒక్క ఫోన్ కాల్ అయినా చేయలేదని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తెలిపారు. మద్యం సేవించిన 17 ఏళ్ల యువకుడు నిర్లక్ష్యంగా కారు నడిపి ఇద్దరు వ్యక్తుల మృతికి కారణమైన ఈ కేసులో తాను ఎలాంటి జోక్యం చేసుకోలేదని చెప్పారు. ‘నేను తరచూ అనేక సమస్యలపై పోలీసు కమిషనర్‌కు ఫోన్ చేస్తా. కానీ ఈ కేసులో నేను ఒక్క కాల్ కూడా ఆయనకు చేయలేదు’ అని అన్నారు.
కాగా, పార్టీ ఎమ్మెల్యే సునీల్ టింగ్రే జోక్యం చేసుకుని యువకుడికి అనుకూలంగా పోలీసులు వ్యవహరించేలా చేశారన్న ఆరోపణలను అజిత్ పవార్ ఖండించారు. ఆ ప్రాంత ఎమ్మెల్యే అయిన ఆయన ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు సంఘటనా స్థలాన్ని సందర్శిస్తారని తెలిపారు. ఈ విషయాన్ని తొక్కిపెట్టేందుకు సునీల్ టింగ్రే ప్రయత్నించారా? అని ప్రశ్నించారు. ఆయనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని అన్నారు.
మరోవైపు సీఎం ఏక్నాథ్ షిండే, హోం శాఖకు నేతృత్వం వహిస్తున్న డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఈ కేసు విషయంలో సరిగా స్పందించారని అజిత్ పవార్ తెలిపారు. తొలుత జాప్యం చేసిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకున్నారని చెప్పారు. అలాగే ఈ కేసులో ప్రమేయం ఉన్న సాసూన్ ఆసుపత్రికి చెందిన డాక్టర్లు కూడా పోలీసు చర్యను ఎదుర్కొన్నారని వెల్లడించారు.