Terror attack : పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) యావత్ భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. గత మంగళవారం జరిగిన ఈ దాడిలో ఏకంగా 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో వారికి అంత్యక్రియలు జరుగుతున్నాయి. ప్రజలు వారికి అశ్రునయనాలతో వీడ్కోలు పలుకుతున్నారు. ఈ క్రమంలో ఆ భయానక ఉగ్రదాడి ఘటన గురించి స్థానికులు గుర్తుచేసుకుంటున్నారు.
సాజద్ అహ్మద్ భట్ అనే ముస్లిం యువకుడు మాట్లాడుతూ.. పహల్గాం పోనీ అసోషియేషన్ అధ్యక్షుడు అబ్దుల్ వహీద్ వాన్ నుంచి తన ఫోన్‌కు ఉగ్రదాడికి సంబంధించిన సమాచారం వచ్చిందని, అతడి పిలుపుమేరకు బాధితులను రక్షించేందుకు తనతోపాటు అసోషియేషన్‌కు చెందిన పలువురం ఘటనా ప్రాంతానికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టామని తెలిపాడు. తమ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా తాము బాధితుల రక్షణ చర్యల్లో పాల్గొన్నామని అన్నాడు. ఉగ్రదాడిలో గాయపడిన ఓ వ్యక్తిని సాజద్ అహ్మద్ భట్ అంబులెన్స్ దగ్గరికి మోసుకెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
‘ఉగ్రదాడి గురించి మా అధ్యక్షుడి నుంచి సందేశం వచ్చినప్పుడు నేను ఇంట్లో కూర్చుని ఉన్నాను. ఘటన జరిగిన అరగంటలో మేం అక్కడికి చేరుకున్నాం. ముందుగా గాయపడిన వాళ్లందరికీ మంచినీళ్లు తాగించాం. నడవలేని వాళ్లను ఎత్తుకున్నాం. అలా అందరినీ ఆస్పత్రికి తరలించాం. మతం కంటే మానవత్వం గొప్పది. ఎవరూ ఏ మతస్తులైనా మాకు టూరిస్టులు. టూరిస్టులంటే మాకు బంధువుల లాంటి వాళ్లు. వాళ్లు లేకపోతే మా జీవితాలను సంపూర్ణం కావు. మా జీవితాల్లో వెలుగులు వాళ్లే. వారిపైనే మా జీవితాలు ఆధారపడి ఉన్నాయి. బాధితుల ఏడుపులు చూసి మాకు ఏడుపాగలేదు. బాధను తట్టుకోలేక నేను నాలుగైదు సార్లు ఏడ్చాను’ అని సాజద్ అహ్మద్ చెప్పాడు.
పహల్గాం ఏటీవీ బైక్ స్టాండ్ అధ్యక్షుడు ఇర్షాద్ అహ్మద్ మాట్లాడుతూ.. ‘ఘటన అనంతరం బాధితులను రక్షించేందుకు తన స్టాండ్‌లో ఏటీవీ బైకులను తీసుకెళ్లాలని సహాయకులకు సూచించాను. మా స్టాండ్‌లోని బైకులన్నీ తీసుకుని మేం బైసరన్‌కు వెళ్లాం. బాధితులకు సాయం చేశాం. గత రెండు రోజులుగా సైనికులు, పోలీసులు ఘటనా ప్రాంతానికి వెళ్లేందుకు మా ఏటీవీ బైకులనే వినియోగిస్తున్నారు. నేను కాల్పుల్లో గాయపడిన నేవీ అధికారి వినయ్ నర్వాల్‌ను ఎత్తుకుని ఆయన భార్యతో కలిసి అంబులెన్స్ వైపు బయలుదేరాను. అతడి నాడి చూస్తే చనిపోయాడని అర్థమైంది. కానీ ఆయన భార్యకు మాత్రం.. బాధపడవద్దనే ఉద్దేశంతో బతికే ఉన్నాడని అబద్దం చెప్పా. ఇలాంటి దుస్థితిని నేను గతంలో ఎన్నడూ చూడలేదు. భవిష్యత్తులో ఎన్నడూ ఇలాంటివి జరగవద్దని కోరుకుంటున్నా’ అన్నాడు.
పహల్గాంలోని ఓ రెస్టారెంట్లో చెఫ్‌గా పనిచేస్తున్న వ్యక్తి కూడా ఉగ్రదాడిని తలుచుకుని బాధపడ్డాడు. తాను 30 ఏళ్లుగా ఇక్కడ చెఫ్‌గా పనిచేస్తున్నానని, ఎన్నడూ ఇంతటి ఘోరమైన ఘటనను చూడలేదని అన్నాడు. భయానక ఉగ్రదాడి ఘటన ఇంకా కళ్లముందే కదలాడుతోందని చెప్పాడు. ఉగ్రవాదుల దాడితో పహల్గాం నిర్మానుష్యంగా మారిందని, రెస్టారెంట్ మూతపడటంతో తనకు ఉపాధి కరువైందని అన్నాడు.