Dhar Bhojshala : వివాదాస్పద భోజ్‌శాల విషయంలో మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఈ భోజ్‌శాలను దేవాలయంగా ప్రకటించింది. అంతేకాదు, హిందువులు ఇక్కడ పూజలు నిర్వహించుకోవచ్చని కూడా వెల్లడించింది. మధ్యప్రదేశ్‌లోని ధర్ జిల్లాలో ఉన్న భోజ్‌శాల–కమల్ మౌలా కాంప్లెక్స్ విషయంలో వివాదం నడుస్తోంది. ఇది దేవాలయం అని హిందూ సంఘాలు అంటుండగా, ఇది తమకే చెందినదని ముస్లిం సంఘాలు చెప్పాయి.
దీంతో ఈ అంశం దశాబ్దాలుగా వివాదంగా మారింది. 2003లో ఈ ప్రదేశం హిందూ, ముస్లింలకు చెందినదని ఏఎస్ఐ (ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా) చెప్పింది. చాలా కాలంగా ఇక్కడ హిందువులు మంగళవారం పూజలు చేస్తుంటారు. ముస్లింలు శుక్రవారం మధ్యాహ్నం నమాజ్ చేస్తుంటారు. మతపరంగా వీటికి మాత్రమే ఇక్కడ అనుమతి ఉంది. తర్వాత హిందూ సంఘాలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించాయి. ఇక్కడ నిరంతరం పూజలు చేసుకునే హక్కు కల్పించాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. దీన్ని ముస్లిం సంఘాలు వ్యతిరేకించాయి. దీంతో ఈ భోజ్‌శాల కాంప్లెక్స్ సంగతి తేల్చాల్సిందిగా ఏఎస్ఐని కోర్టు ఆదేశించింది.
కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఏఎస్ఐ అధికారులు విచారణ జరిపి నివేదిక అందించారు. ఈ నివేదిక ఆధారంగా ఇది దేవాలయమే అని మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు వెల్లడించింది. ఇక్కడ హిందువులు పూజలు చేసుకోవచ్చని అనుమతించింది. ఏఎస్ఐ అందించిన శాస్త్రీయ, చారిత్రక ఆధారాలను అనుసరించి ఈ తీర్పు ఇస్తున్నట్లు కోర్టు తెలిపింది. అన్ని వర్గాలకు చెందిన రాజ్యాంగపరమైన అంశాల్ని, హక్కుల్ని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోర్టు తెలిపింది. ఏఎస్ఐ ఒక చట్టబద్ధమైన, శాస్త్రీయ సంస్థ అని, ఆ సంస్థ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్నట్లు చెప్పింది. పరమార రాజు భోజ్ హయాంలో ఈ ప్రదేశం సంస్కృత విద్యా కేంద్రంగా, సరస్వతి దేవాలయంగా విలసిల్లినట్లు కోర్టు గుర్తించింది.
అలాగే, ఈ ప్రదేశాన్ని చారిత్రక ప్రదేశంగా రక్షించాలని కూడా కేంద్ర ఆర్కియాలజీ శాఖకు సూచించింది. ఇక, ఈ కేసు విచారణకు సహకరించిన అన్ని పక్షాల లాయర్లకు కోర్టు కృతజ్ఞతలు తెలిపింది. అయితే, కోర్టు తీర్పుపై ముస్లిం సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ తీర్పును పరిశీలించిన తర్వాత, దీన్ని సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని తెలిపాయి. మరోవైపు కోర్టు తీర్పు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భోజ్‌శాల ప్రాంతంలో భారీగా భద్రతా బలగాల్ని మోహరించారు. 1,200 మంది వరకు పోలీసులు, కేంద్ర బలగాలు మోహరించి భద్రతా చర్యల్లో పాల్గొన్నారు.