న్యూఢిల్లీ, మే 24: రక్షణ శాఖ వైమానిక స్థావరాల్లో టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో విమానాల కిటికీ తెరలను(విండో షేడ్స్) మూసివేసి ఉంచాలని డీజీసీఏ శనివారం ఆదేశాలు జారీ చేసింది. అంతేగాక సైన్య స్థావరాల వద్ద టేకాఫ్, ల్యాండింగ్ అవుతుండగా..ఆ స్థావరాలను ఫొటోలు, వీడియో తీయటం నిషిద్ధమని డీజీసీఏ పేర్కొన్నది.
ఈ మేరకు నిబంధనలు పాటిస్తూ, విమాన ప్రయాణికులను అప్రమత్తం చేయాలని కమర్షియల్ ఎయిర్‌లైన్స్‌ను డీజీసీఏ కోరింది. పౌర విమానయానం, మిలిటరీ ఆపరేషన్లు..రెండింటికీ వినియోగిస్తున్న పలు విమానాశ్రయాల్లో ఈ నిబంధనలు వర్తిస్తాయని డీజీసీఏ పేర్కొన్నది. మరీ ముఖ్యంగా పాక్‌తో సరిహద్దు ఉన్న పశ్చిమ భారత స్థావరాల వద్ద ఈ సూచన తప్పక పాటించాలని పేర్కొన్నది.