భోపాల్: ఉద్యోగం రాలేదన్న మనస్తాపంతో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలిసి అతడి తల్లి గుండెపోటుతో మరణించింది. తల్లి, కుమారుడు మరణించిన సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (Son Suicide, Mother Dies OF Heart Attack) మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఈ సంఘటన జరిగింది. 33 ఏళ్ల మనీష్ రాజ్‌పుత్ ప్రభుత్వ ఉద్యోగాల కోసం చాలా పరీక్షలు రాశాడు. ఏ ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందాడు. ఈ నేపథ్యంలో జనవరి 18న శనివారం రాత్రి వేళ ఇంట్లో విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు మనీష్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు.
కాగా, మనీష్ చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు. అయితే కుమారుడి మరణవార్త తెలిసి అతడి తల్లి రాధా గుండెపోటుతో కుప్పకూలి చనిపోయింది. ఈ నేపథ్యంలో ఆ కుటుంబంలో విషాదం నెలకొన్నది. రాధా పెద్ద కుమారుడు అనిల్ ఈ విషయాన్ని పోలీసులకు తెలిపాడు. దీంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.