న్యూఢిల్లీ, అక్టోబర్ 11: దేశంలో ఉన్నత విద్యకు ఒకే నియంత్రణ వ్యవస్థను తీసుకొచ్చేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నది. త్వరలో హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (హెచ్ఈసీఐ) బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. వైద్య, న్యాయ కళాశాలలను ఈ బిల్లు పరిధిలోకి తీసుకురావడం లేదని తెలిపారు. ఉన్నత విద్యాసంస్థలకు నిధులను సమకూర్చే స్వయం ప్రతిపత్తి హెచ్ఈసీఐకి కాకుండా పరిపాలనా మంత్రిత్వ శాఖకే ఉంటుందని స్పష్టంచేశారు. ‘హెచ్ఈసీఐ బిల్లు కసరత్తును ఇప్పటికే ప్రారంభించాం. హెచ్ఈసీఐ ప్రధానంగా మూడు పాత్రలు పోషిస్తుంది. వాటిలో మొదటిది నియంత్రణా వ్యవస్థ పాత్ర. ప్రస్తుతం ఈ పాత్రను పోషిస్తున్న యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఇప్పటికే అంతర్గతంగా ఎన్నో సంస్కరణలను ప్రారంభించింది.
ఉన్నత విద్యాసంస్థలకు గుర్తింపునిచ్చే సంస్థగా హెచ్ఈసీఐ రెండో పాత్ర పోషిస్తుంది. ఇది రెండు స్థాయిల్లో జరుగుతుంది. కళాశాలలతోపాటు వాటి ప్రోగ్రాములు, కోర్సులకు గుర్తింపు ఇస్తుంది. దీనిలో భాగంగా న్యాక్ (నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్)ను పునర్వ్యవస్థీకరించేందుకు డాక్టర్ రాధాకృష్ణన్ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేశాం. ఈ కమిటీ ఇప్పటికే కొన్ని సిఫారసులు చేసింది. ఈ రెండు పాత్రలతోపాటు విద్యార్థులకు ఏమి బోధించాలి? ఎలా బోధించాలి? అన్నదానిపై వృత్తిపరమైన ప్రమాణాలను నెలకొల్పే పాత్రను కూడా హెచ్ఈసీఐ పోషిస్తుంది’ అని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివరించారు.