బెంగళూరు, మే 31: కొద్ది రోజుల్లో కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ దేశంలోనే అత్యంత సంపన్న సీఎంగా రికార్డు సృష్టించనున్నారు. 2023 ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆయన ప్రస్తుత ఆస్తుల విలువ రూ. 1400 కోట్ల కన్నా ఎక్కువే. ఇప్పటివరకు దేశంలో ధనిక సీఎంగా ఏపీకి చెందిన తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (రూ. 931 కోట్లు) ఉన్నారు. తర్వాతి స్థానంలో ఇటీవల తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన విజయ్ (రూ. 624 కోట్లు) ఉన్నారు. వారిద్దరినీ వెనక్కి నెట్టి డీకే ఇప్పుడు మొదటి స్థానాన్ని ఆక్రమించనున్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న 64 ఏండ్ల శివకుమార్ జూన్ 3న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
కర్ణాటకలో మంత్రి పదవుల కోసం పోటీ
ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న క్రమంలో ఆయన క్యాబినెట్లో మంత్రి పదవుల కోసం అప్పుడే పైరవీలు ప్రారంభమయ్యాయి. జూన్ 3న ప్రమాణ స్వీకారం చేయనున్న డీకే తన క్యాబినెట్లో స్థానం కల్పించే మంత్రుల తుది జాబితా నిర్ధారణ కోసం కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కలిసేందుకు ఢిల్లీ వెళ్లనున్నారు. మంత్రి పదవుల కోసం ఇప్పటికే పలువురు ఢిల్లీకి పయనమయ్యారు.