న్యూఢిల్లీ, ఆగస్టు 2: ఇటీవల నీట్-యూజీ 2026 పరీక్ష పత్రాల లీకేజీకి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. మరో పక్క పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు విధించేలా పార్లమెంట్లో చట్టంలో మార్పు చేయడం వంటి పరిణామాలు చోటుకుంటున్నాయి. అయితే వాస్తవానికి దేశంలో ఇలాంటి కేసులు ఇప్పటికే న్యాయస్థానాల్లో దశాబ్దాల తరబడి కనీసం విచారణకు కూడా నోచుకోకుండా ఉన్నాయంటే ఆశ్చర్యం కలుగుతుంది. నీట్ లాంటి ప్రవేశ పరీక్షలు, ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించి దేశంలో 158 సీబీఐ కేసులు న్యాయస్థానాల్లో విచారణ కోసం ఎదురుచూస్తున్నాయి.
ఇందులో పలు కేసులకు సంబంధించి సీబీఐ దర్యాప్తు కూడా పూర్తయ్యింది. మరికొన్ని రెండు దశాబ్దాల కన్నా ముందే రిజిస్టరై ఉన్నాయి. ఈ క్రమంలో కొత్తగా యాంటీ పేపర్ లీక్ చట్టం అమలులోకి వచ్చినందున పెండింగ్‌లో ఉన్న ఈ కేసులన్నీ ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు బదిలీ చేయాలని కోరేందుకు హైకోర్టును ఆశ్రయించాలని సీబీఐ నిర్ణయించింది.
దేశ రాజధాని ఢిల్లీలో ఇలాంటి కేసులు 2000 నుంచి 25కు పైగా విచారణ కోసం ఎదురుచూస్తున్నాయి. ఇందులో ఎయిమ్స్ పీజీ రిక్రూట్మెంట్ పరీక్ష, 2010-11, ఢిల్లీ యూనివర్సిటీ మెడికల్, డెంటల్ ప్రవేశ పరీక్ష 2011, క్యాట్-2004లో జరిగిన అక్రమాలు, ఎస్ఎస్సీ-2013, ఉపాధ్యాయ నియామక పరీక్షలకు సంబంధించినవి ఉన్నాయి. నీట్ 2024 పేపర్ లీక్‌కు సంబంధించి బీహార్‌లో మూడు కేసులతో పాటు 2003, 2011లలో ప్రీమెడికల్ టెస్ట్‌లో అక్రమాలకు సంబంధించినవి ఉన్నాయి.