– కేటీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని దుస్థితి
– ప్రజలేవగించుకుంటున్న తొలి ముఖ్యమంత్రి రేవంతే
– తగిన బుద్ధి చెప్పటం ఖాయమన్న మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
కోదాడ, అక్టోబర్ 01 : ఎన్నికలు పూర్తయి దాదాపు మూడేళ్లు గడుస్తున్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలలో తామేం చేశామో చెప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిరిసిల్ల సభలో కేసీఆర్ కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు చేయడం సిగ్గుచేటని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం కోదాడలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేస్తారేమోనని అక్కడి ప్రజలు ఎదురు చూశారని, కానీ వారికి నిరాశే ఎదురైందన్నారు. ఇంకెంతకాలం వ్యక్తిగత విమర్శలతో కాలం వెళ్లబుచ్చుతారని, అక్కడి ప్రజలే బహిరంగంగా విమర్శిస్తున్నారన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు, రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్ కార్యాచరణపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
సిరిసిల్లలో ముఖ్యమంత్రి ప్రసంగంలో అభివృద్ధి, ప్రజలకు ఇచ్చిన హామీలపై స్పష్టమైన సమాధానాలు కనిపించలేదని బొల్లం మల్లయ్య యాదవ్ విమర్శించారు. చేయబోయే పనులపై స్పష్టమైన రూపకల్పన లేదని, చేసిన పనులను చెప్పుకోవడానికి కూడా ప్రభుత్వం వద్ద చెప్పుకోదగ్గ ఘనతలు లేవన్నారు. కేటీఆర్ డిగిన ప్రశ్నల్లో ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా, ‘ఫిరంగులు పేలుద్దాం’, ‘గద్దెలు కూల్చుదాం’ వంటి అసంబద్ధ రాజకీయ విమర్శలకు దిగడం సరికాదని ఆయన పేర్కొన్నారు. నాడు తెలంగాణ ఉద్యమకారులపై రేవంత్ రెడ్డి ఫిరంగులు ఎక్కుపెట్టిన విషయాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు.
ముఖ్యమంత్రి మాట్లాడుతున్న తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారని, రాష్ట్ర అభివృద్ధిని గాలికొదిలేసి, ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి, కేవలం ఒక వ్యక్తిని, ఒక కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని రాజకీయాలు చేయడం పట్ల ప్రజలు ఏవగించుకుంటున్న తొలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినేని ఎద్దేవా చేశారు. వ్యక్తిగత కక్షలు, కక్షసాధింపు రాజకీయాలకు స్వస్తి చెప్పి, రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. ప్రజా సమస్యలు, అభివృద్ధి, హామీల అమలుపై సమాధానం చెప్పకుండా వ్యక్తిగత విమర్శలకు పరిమితమవుతున్న ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు తగిన సమయంలో తగిన బుద్ధి చెప్పడం ఖాయమని పేర్కొన్నారు.