MK Stalin | చెన్నై, మార్చి 6: భాషాపరమైన సమానత్వాన్ని కావాలని డిమాండు చేయడం భాషా దురభిమానం కాదని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించారు. అసలైన దురభిమానులు, జాతి వ్యతిరేకులు హిందీ ఉన్మాదులని, తమ హక్కులు సహజమని, ప్రతిఘటన దేశద్రోహమని వారు భావిస్తారని ఆయన చెప్పారు.
తమిళనాడులో తమిళ భాషకు సరైన స్థానం దక్కాలని తాము కోరితే దాన్ని నేరంగా పరిగణిస్తూ తమపైన భాషాదురభిమానులు, జాతి వ్యతిరేకులంటూ ముద్ర వేస్తున్నారని ఓ సోషల్ మీడియా పోస్టులో ఆయన పేర్కొన్నారు. గాడ్సే సిద్ధాంతాన్ని గొప్పగా చెప్పుకునే వ్యక్తులే చైనా దురాక్రమణ, బంగ్లాదేశ్ విముక్తి పోరాటం, కార్గిల్ యుద్ధ కాలాలలో అత్యధిక విరాళాలను అందచేసిన డీఎంకే ప్రభుత్వంపై నిందలు చేస్తున్నారని ఆయన పరోక్షంగా బీజేపీపై ధ్వజమెత్తారు.
వారి సైద్ధాంతిక ముత్తాతలలో ఒకరు బాపూజీని హత్య చేశారని ఆయన ఎద్దేవా చేశారు. దురభిమానమంటే ..మూడు క్రిమినల్ చట్టాలు తమిళ ప్రజలకు ఒక్క ముక్క కూడా పలకలేని, అర్థం కాని భాషలో ఉండడమేనని ఆయన పేర్కొన్నారు. దేశానికి అత్యధికంగా నిధులు అందచేస్తున్న రాష్ర్టాన్ని ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడడాన్నే దురభిమానం అంటారని ఆయన తెలిపారు. తమకు రావాలసిన న్యాయమైన వాటాను ఇవ్వకపోవడమే దురభిమానమని స్టాలిన్ పేర్కొన్నారు.