(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): నియోజకవర్గాల పునర్విభజన బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందిన తర్వాత డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేస్తామని, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను ఈ కమిషనే పూర్తి చేస్తుందని కేంద్రం వెల్లడించింది.
ఈ క్రమంలో డీలిమిటేషన్ కమిషన్లో ఎవరెవరు ఉంటారు? దాని విధులేంటి? వంటి వివరాలను తెలుపుతూనే.. నియోజకవర్గాల పునర్విభజనపై కమిషన్ తీసుకొనే నిర్ణయమే ఫైనల్ అని, దాన్ని ఎవరూ సవాల్ చేయలేరంటూ కేంద్రం డ్రాఫ్ట్ బిల్లులో ఓ మెలిక పెట్టింది. దీంతో ఇప్పుడు ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది.
డ్రాఫ్ట్ బిల్లు ప్రకారం.. ‘నియోజకవర్గాల పునర్విభజనపై తుది నిర్ణయాన్ని డీలిమిటేషన్ కమిషనే ప్రకటిస్తుంది. కమిషన్ ఒకసారి అధికారికంగా గెజిట్ను విడుదల చేస్తే, అది చట్టంగా మారినట్టే. దాన్ని ఎవరూ ఏ న్యాయస్థానంలోనూ సవాల్ చేయలేరు’ అని కేంద్రం పేర్కొన్నది. ప్రస్తుతం ఈ కండీషన్పై విపక్ష నేతలు మండిపడుతున్నారు.
డీలిమిటేషన్ కమిషన్ నిర్ణయాలు తమకు ఆమోదయోగ్యంగా లేనప్పుడు ఏం చేయాలని, ఎవరిని సంప్రదించాలని? ప్రతిపక్ష పార్టీల నేతలు నిలదీస్తున్నారు. కమిషన్ నిర్ణయాన్ని న్యాయస్థానాల్లోనూ సవాల్ చేయలేరంటూ నిబంధన పొందుపరచడాన్ని తప్పుబడుతున్నారు. డీలిమిటేషన్ ముసుగులో కేంద్రం దొంగాట ఆడుతున్నదని, కమిషన్ను ముందు పెట్టి రాజకీయ లబ్ధి పొందడానికి కుట్ర చేస్తున్నదని మండిపడుతున్నారు.