న్యూఢిల్లీ: డీలిమిటేషన్(Delimitation), మహిళా రిజర్వేషన్ బిల్లులను మళ్లీ పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. త్వరలో ప్రారంభంకానున్న వర్షాకాల సమావేశాల్లో ఆ రెండు బిల్లులను మళ్లీ ఉభయసభల్లో పెట్టాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలిసింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్(Rajnath Singh) నివాసంలో ఇవాళ జరిగిన భేటీలో ఈ అంశంపై చర్చ చేసినట్లు తెలిసింది. ఏప్రిల్లో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కానీ మూడో వంతు మెజారిటీ లేకపోవడంతో ఆ రెండు బిల్లులు వీగిపోయాయి. ఎన్డీఏ మంత్రులతో ఇవాళ రాజ్నాథ్ సింగ్ సమావేశం నిర్వహించారు.
వర్షాకాల పార్లమెంట్ సమావేశాలకు చెందిన వ్యూహాన్ని రచించినట్లు తెలిసింది. వివిధ రాజకీయ పార్టీల అంతరంగాన్ని తెలుసుకునేందుకు కొందరు మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్ విభజన ప్రక్రియను పూర్తి చేసేందుకు అనేక రాజకీయ పార్టీలతో ఏకాభిప్రాయం కోసం కేంద్రం ప్రయత్నిస్తున్నది. అన్ని రాష్ట్రాల్లోనూ 50 శాతం లోక్సభ సీట్లను పెంచే హామీతో కొత్త డీలిమిటేషన్ బిల్లును తెచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నది. ఏప్రిల్లో జరిగిన సమావేశాల్లో అన్ని పార్టీలు 50 శాతం నిబంధన పెట్టాలని డిమండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే 50 శాతం సీట్ల పెంపు అంశంలో రాతపూర్వక వివరణ ఇస్తే బిల్లు గురించి చర్చిస్తామని ఎన్సీపీ నేత సుప్రీయా సూలే తెలిపారు.
ప్రస్తుతం లోక్సభలో 543 సీట్లు ఉన్నాయి. దీంట్లో మూడో వంతు అంటే 362 మంది అనుకూలంగా బిల్లుకు ఓటేయాల్సి ఉంటుంది. మూడు సీట్లు ఖాళీగా ఉన్నాయి. దీంతో మూడో వంతు 360కి తగ్గుతుంది. అయితే ఏప్రిల్లో బిల్లు వీగిపోయింది. అప్పుడు అనుకూలంగా 298 మంది , వ్యతిరేకంగా 230 మంది ఓటేశారు. ఈ దశలో ఎన్డీఏకు 293 మంది ఎంపీలు ఉన్నారు. తాజాగా 20 మంది టీఎంసీ , శివసేన యూబీటీ రెబల్ ఎంపీలు ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నారు. దీంతో ఎన్డీఏ సంఖ్య 319కి చేరుతుంది. అయినా కానీ ఇంకా మూడో వంతు మెజారిటీకి దూరమే అవుతుంది. అయితే 22 ఎంపీ సీట్లు ఉన్న డీఎంకేపైనే ఇప్పుడు అందరి ఫోకస్ ఉంటుంది. డీఎంకేతో పాటు ఎన్సీపీ ఎస్పీ కూడా మద్దతు ఇస్తే అప్పుడు డీలిమిటేషన్ బిల్లు గట్టెక్కే అవకాశం ఉన్నది.