Delhi Voters | న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీకి సంబంధించి ఓటర్ల తుది జాబితా విడుదలైంది. ఢిల్లీ పరిధిలోని 7 లోక్సభ స్థానాల్లో 1,47,18,119 మంది ఓటర్లు ఉన్నట్లు ఢిల్లీ ఎన్నికల సంఘం ప్రకటించింది. 18 నుండి 19 సంవత్సరాల వయస్సు గల యువ ఓటర్ల సంఖ్య గణనీయంగా 85 శాతం పెరిగింది. మహిళా ఓటర్ల నమోదు కూడా మెరుగుపడినట్లు పేర్కొంది.
1,47,18,119 ఓటర్లలో 79,86,572 మంది పురుషులు, 67,30,371 మంది మహిళలు, 1,176 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నట్లు తెలిపింది. 2023 తుది జాబితాతో పోలిస్తే 58,182 మంది ఓటర్లు తగ్గారు. 2023 తుది ఓటర్ల జాబితా ప్రకారం మొత్తం ఓటర్ల సంఖ్య 1,47,76,301.
18 నుంచి 19 ఏళ్లలోపు యువ ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి సారించారు. ఢిల్లీ ఓటర్ల జాబితాలో మొత్తం 67,930 మంది యువ ఓటర్లు తమ పేర్లను నమోదు చేశారు. 2023 తుది జాబితాతో పోలిస్తే యువ ఓటర్లు 9.69 శాతం పెరిగారు. కొత్తగా నమోదు కార్యక్రమం చేపట్టిన తర్వాత 9,335 మంది ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.