Tragedy | తనను లైంగికంగా సంతృప్తిపరచడం లేదని కట్టుకున్న భర్తనే ఓ భార్య దారుణంగా హత్య చేసింది. అనంతరం తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని ఓ కట్టుకథ అల్లింది. కానీ అనుమానం వచ్చిన పోలీసులు తమదైన స్టైల్లో దర్యాప్తు చేయగా అసలు విషయం బయటకొచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘోరం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన మొహమ్మద్ షాహిద్ అలియాస్ ఇర్ఫాన్ (32), ఫర్జానా ఖాన్(29) భార్యాభర్తలు. తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతూ ఆదివారం సాయంత్రం ఢిల్లీలోని నిహాల్ విహార్ ప్రాంతంలోని సంజయ్ గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చింది. ఇర్ఫాన్‌ను పరీక్షించిన వైద్యులు.. అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. అయితే ఇర్ఫాన్ శరీరంపై గాయాలు గమనించిన వైద్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఇర్ఫాన్ ఎలా చనిపోయాడని ఫర్జానాను పోలీసులు ప్రశ్నించగా.. తన భర్త కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించింది. అయితే పోస్టుమార్టం నివేదికలో మాత్రం ఆ గాయాలు ఇర్ఫాన్ చేసుకున్నవి కాదని.. ఎవరో గాయపరిచి ఉంటారని తేలింది. దీంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఫర్జానాపై అనుమానం వచ్చి.. ఆమె ఫోన్ చెక్ చేయగా.. బ్రౌజింగ్ హిస్టరీ డిలీట్ చేసి ఉంది. దీంతో ఆమె ఫోన్‌ను ఫొరెన్సిక్ ల్యాబ్‌కు పంపించగా విస్తుపోయే నిజాలు తెలిశాయి.
అల్యూమినియం ఫాస్పైడ్ వంటి విషపూరిత పదార్థాల ఉపయోగం, దాని ప్రభావాల గురించి ఫర్జానా గూగుల్‌లో సెర్చ్ చేసినట్లుగా ఫోరెన్సిక్ నివేదికలో తేలింది. దీంతో ఫర్జానాను పోలీసులు తమ స్టైల్లో విచారించగా.. నేరాన్ని అంగీకరించింది. తన భర్త లైంగిక సంతృప్తి ఇవ్వడం లేదని.. ఆ కారణంతోనే అతన్ని చంపేయాలని నిర్ణయించుకున్నట్లుగా పోలీసులకు ఫర్జానా చెప్పింది. కాగా, ఇర్ఫాన్ మృతదేహంపై శరీరంపై మూడు లోతైన గాయాలు ఉన్నాయని, ఒకటి గుండెను చీల్చుకుంటూ వెళ్లిందని పోలీసులు తెలిపారు. పేగులపై అనేక గాయాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ హత్య వెనుక ఇంకా ఏదైనా కారణం ఉందేమోన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.