న్యూఢిల్లీ: ఢిల్లీలో శుక్రవారం సాయంత్రం అకస్మాత్తుగా సుడిగాలులు బీభత్సం సృష్టించాయి. దీంతో నగరంలోని విమానాశ్రయంలో దాదాపు 205 విమానాల రాకపోకలు ఆలస్యమయ్యాయి. సుమారు 50 విమానాలను దారి మళ్లించారు. ఓ అధికారి మాట్లాడుతూ, చాలా విమానాలను దారి మళ్లించడం కానీ, రద్దు చేయడం కానీ జరిగిందన్నారు. దీనివల్ల ప్రయాణికులకు అసౌకర్యం కలిగిందని చెప్పారు.
తాము దాదాపు 12 గంటలపాటు ఇబ్బందులు పడ్డామని కొందరు ప్రయాణికులు సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు. ఈ గాలుల వల్ల ఒకరు మృతి చెందగా.. ముగ్గురు గాయపడ్డారు. మరోవైపు చైనాలో శనివారం భీకర గాలులు బీభత్సం సృష్టించాయి. బీజింగ్‌లో చెట్లు నేలకొరిగాయి. దీంతో 693 విమాన సర్వీసులను అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు.