Delhi Stampede | ఢిల్లీ రైల్వే స్టేషన్లో శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాటపై రైల్వే శాఖ ప్రాథమిక నివేదికను విడుదల చేసింది. ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపింది. ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగించిందని ప్రాథమిక నివేదికలో పేర్కొంది.
నిన్న రాత్రి ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ రావడం కొంత ఆలస్యమైందని రైల్వే శాఖ తన ప్రాథమిక నివేదికలో పేర్కొంది. ఆ సమయంలో కుంభమేళాకు వెళ్లాల్సిన ప్రయాణికులు ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ కోసం 14వ ప్లాట్‌ఫామ్‌పై వేచి ఉన్నారని తెలిపింది. ఇంతలో 12వ ప్లాట్‌ఫామ్‌పై ప్రత్యేక రైలును ప్రకటించారని చెప్పింది. దీంతో దానినే తాము ఎక్కాల్సిన రైలుగా చాలామంది భ్రమించి అక్కడకు వెళ్లేందుకు ప్రయత్నించారు.. ఇలా ప్లాట్‌ఫామ్ మారేందుకు ప్రయాణికులు అందరూ ఒక్కసారిగా కదలడంతో తొక్కిసలాట జరిగిందని పేర్కొంది.
కుంభమేళాకు వెళ్లాల్సిన ప్రయాణికులు ఢిల్లీ రైల్వే స్టేషన్లో ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగించిందని రైల్వే అధికారులు ప్రాథమిక నివేదికలో పేర్కొన్నారు. ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.
ఢిల్లీ రైల్వే స్టేషన్లో శనివారం రాత్రి 10 గంటల సమయంలో జరిగిన తొక్కిసలాటలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. డజన్ల కొద్దీ ప్రజలు గాయపడ్డారు. ఈ ఘటనపై స్పందించిన రైల్వే శాఖ ఇప్పటికే మృతులకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది.