Air Pollution | దేశ రాజధాని నగరం ఢిల్లీలో వాయు కాలుష్యం కొనసాగుతున్నది. ఓ వైపు కాలుష్యంతో ఇబ్బందులుపడుతుండగా.. మరో వైపు భారీ మంచుదుప్పటి నగరాన్ని కమ్మేసింది. దాంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాలుష్యం నిరంతరం పెరుగుతుండడంతో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో గురువారం వాయు నాణ్యత సూచీ (AQI) 400 దాటడంతో గ్యాస్ ఛాంబర్‌గా మారింది. ఫలితంగా జనం ఊపిరిపీల్చుకునేందుకు తిప్పలు పడుతున్నారు. ఎక్కువగా ఆరుబయట తిరుగుతుండడంతో ఛాతిలో మంట, కళ్లలో మంటగా ఉంటుందని వాపోతున్నారు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) డేటా ప్రకారం.. గురువారం ఉదయం 8 గంటలకు ఆనంద్ విహార్‌లో ఏక్యూఐ 405గా రికార్డయ్యింది. ముండ్కాలో 413, బవానాలో 418, అశోక్ విహార్‌లో 414, ఐటీవోలో 355, జహంగీర్‌పురి 435, రోహిణి 407 రికార్డయ్యింది. నజాఫ్‌గఢ్ 366, ఆర్కేపురం 387, పంజాబీ బాగ్ 407, సోనియా విహార్ 394, ద్వారకా సెక్టార్-8 వద్ద 401 నమోదైంది.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ (IITM) ప్రకారం.. నగరంలో వాయువ్య దిశ నుంచి గంటకు ఎనిమిది కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేసింది. శుక్ర, శనివారాల్లోనూ గాలులు కొనసాగే అవకాశం ఉందని చెప్పింది. అదే సమయంలో దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని.. దాంతో గాలి నాణ్యత మరింత పడిపోతుందని అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఉత్తరభారతంలో రాబోయే ఐదురోజుల పాటు దట్టంగా పొగమంచు కురిసే అవకాశం ఉందని అంచనా. ప్రస్తుతం ఎన్సీఆర్ పరిధిలో గాలి విషపూరితంగా మారిన నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. 50శాతం మంది ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోం విధానాన్ని అమలు చేస్తున్నది. ఢిల్లీ ప్రభుత్వంలోని 80 విభాగాలు, వివిధ ఏజెన్సీలతో పాటు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం ఉద్యోగుల సంఖ్య దాదాపు 1.40 లక్షలుగా ఉన్నది. అలాగే, గురుగ్రామ్‌లోని ఐటీ కంపెనీలు సైతం ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసే అవకాశం కల్పిస్తున్నది. గురుగ్రామ్, సోనిపట్, ఫరీదాబాద్‌తో పాటు ఎన్సీఆర్లోని పలు నగరాల్లో కాలుష్యం కారణంగా కళాశాలలు మూతపడ్డాయి.
#WATCH | Delhi | A layer of smog envelops the capital city as pollution levels continue to rise.
Visuals from AIIMS, where the AQI has been recorded at 339, categorised as ‘very poor’ according to the CPCB. pic.twitter.com/4ry73LLjp0
— ANI (@ANI) November 21, 2024