Cocaine Seized | దేశ రాజధాని ఢిల్లీ నగరంలో అంతర్జాతీయ డ్రగ్ స్మగ్లింగ్ ముఠాగుట్టు రట్టయ్యింది. 500 కిలోల కొకైన్‌ను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ విలువ రూ.2వేలకోట్లకుపైగా ఉంటుందని అంచనా. ఈ కేసులో నలుగురు నిందితులను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అరెస్టు చేసింది. పక్కా సమాచారం మేరకు స్పెషల్ టీం సౌత్ ఢిల్లీలో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 560 కిలోలకుపైగా కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నామని.. మార్కెట్లో విలువ రూ.2వేలకోట్లు ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం పోలీసులు నిందితులను విచారిస్తున్నారు. ఇటీవల పోలీసులు డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకొని.. ఇద్దరు ఆఫ్ఘన్లను అరెస్టు చేశారు. ఇద్దరి నుంచి 400 గ్రాముల హెరాయిన్, 160 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా.. ముఠా గుట్టురట్టయ్యింది.