Pilot arrest : మహిళలను రహస్యంగా వీడియో తీస్తున్న పైలట్ (Pilot) ను పోలీసులు (Police) అరెస్ట్ (Arrest) చేశారు. బహిరంగ ప్రదేశాలలో మహిళల వీడియోలను పైలట్ అభ్యంతరకరంగా రికార్డు చేస్తుండగా ఓ మహిళ గుర్తించింది. ఆమె వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకునే సరికి నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. దాంతో అక్కడున్న సీసీ కెమెరాల (CC cameras) ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలోని కిషన్‌గఢ్ ఏరియాలోగల శని బజార్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
లైటర్ ఆకారంలో ఉన్న స్పై కెమెరాతో సదరు పైలట్ మహిళలను అభ్యంతరకరంగా చిత్రీకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన మోహిత్ ప్రియదర్శిగా గుర్తించారు. అతడు ఓ ప్రైవేట్ ఎయిర్‌లైన్స్‌లో పైలట్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అతడి నుంచి మహిళల అభ్యంతరకర వీడియోలు ఉన్న స్పై కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు పలు బహిరంగ ప్రదేశాలలో మహిళలను అసభ్యకరంగా చిత్రీకరిస్తున్నట్లు గుర్తించామని చెప్పారు.
ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నిందితుడు వీడియోలను ఎవరికైనా షేర్ చేశాడా..? అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నామన్నారు.