న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి సీనియర్ మంత్రి కైలాష్ గహ్లోట్ (Kailash Gahlot) షాక్ ఇచ్చారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మంత్రి పదవితోపాటు పార్టీకి రాజీనామా చేశారు. ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌కు తన రాజీనామా లేఖ పంపారు. పార్టీలోని అనేక లోపాలను ఆయన ఎత్తిచూపారు. రాజకీయ ఆశయాలు, ప్రజల పట్ల పార్టీ నిబద్ధతను ప్రశ్నించారు.
కాగా, యమునా నది పరిశుభ్రతతో సహా ప్రజలకు ఇచ్చిన అనేక వాగ్దానాలు నెరవేరలేదని కైలాష్ గహ్లోట్ ఆరోపించారు. కేజ్రీవాల్ సీఎంగా ఉన్నప్పుడు అధికార నివాసమైన ‘షీష్మహల్’ ఆధునీకరణ కోసం సుమారు రూ.45 కోట్లు ఖర్చు చేయడంపై వచ్చిన విమర్శలను ఆయన ప్రస్తావించారు. ఇలాంటి వాటి వల్ల ప్రజలు ఆప్‌పై నమ్మకం కోల్పోయారని అన్నారు.
మరోవైపు కేంద్రంతో పోరాడటానికి ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తే ఢిల్లీకి నిజమైన అభివృద్ధి జరుగదని ఇప్పుడు స్పష్టమవుతున్నదని కైలాష్ గహ్లోట్ తెలిపారు. ‘ఢిల్లీ ప్రజలకు సేవ చేయాలనే నిబద్ధతతో నేను నా రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించా. దానిని కొనసాగించాలనుకుంటున్నా. అందుకే ఆప్ నుంచి వైదొలగడం తప్ప మరో మార్గం లేకపోవడంతో ఆప్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశా. మీ ఆరోగ్యం, భవిష్యత్తు కోసం శుభాకాంక్షలు తెలియజేస్తున్నా’ అని కేజ్రీవాల్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.
కాగా, ఢిల్లీ ప్రభుత్వంలో హోం, రవాణా, ఐటీ, మహిళ-శిశు అభివృద్ధితో సహా కీలకమైన శాఖలు నిర్వహిస్తున్న కైలాష్ గహ్లోట్ రాజీనామాను ఢిల్లీ సీఎం అతిషి ఆమోదించారు. ఆప్‌ను వీడిన ఆయన బీజేపీలో చేరవచ్చని తెలుస్తున్నది.
— Kailash Gahlot (@kgahlot) November 17, 2024