Arrest : దీపావళి పండుగ (Diwali fest) రోజు అందరూ పటాకులు కాల్చి సంబురాలు జరుపుకుంటే.. ఆ తండ్రీకొడుకులు మాత్రం తమ దగ్గరున్న తుపాకులు పేల్చుతూ ఖుషీ చేసుకున్నారు. అంతటితో ఆగకుండా ఆ దృశ్యాలను వీడియో తీసుకున్నారు. వాటిని ఇన్స్టాగ్రామ్ (Instagram) లో షేర్ చేయడంతో ఇంటర్నెట్లో వైరల్‌గా మారాయి. దాంతో తండ్రీకొడుకులు ఇద్దరూ కటకటాల వెనక్కి వెళ్లాల్సి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. దేశరాజధాని ఢిల్లీలోని శాస్త్రినగర్‌కు చెందిన ముకేశ్ కుమార్ (42) క్యాటరింగ్, స్వీట్ల వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో దీపావళి పండుగ రోజు వారు అందరికంటే భిన్నంగా పండుగను సెలెబ్రేట్ చేసుకున్నారు. ఆయుధ చట్టాన్ని ఉల్లంఘించి తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపారు. ఆ దృశ్యాలను మొబైల్లో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
దాంతో అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అక్టోబర్ 30న ఈ విషయం యాంటీ నార్కొటిక్ సెల్ దృష్టిలో పడింది. దాంతో వాళ్లు నిందితుల మొబైల్ నెంబర్‌ను ట్రేస్ చేసి.. వారు శాస్త్రినగర్‌లో ఉన్నట్లు గుర్తించింది. శాస్త్రినగర్‌కు వెళ్లి వారి స్వీట్ల దుకాణం నుంచే నిందితులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుంది. ఆయుధ చట్టం ఉల్లంఘన కింద వారిపై కేసులు నమోదు చేసింది.