న్యూఢిల్లీ: ఇద్దరికి ఏడాది కిందే వివాహమయ్యింది. అయితే తగాదాలతో వేర్వేరుగా ఉంటున్నారు. అమ్మగారింట్లో ఉన్న ఆమెతో తరచూ గొడపడుతున్నాడు. విసుగుచెందిన ఆమె తన భర్తపై కేసు పెట్టింది. దీంతో కేసు వాపసు తీసుకోవాలని బెదిరించాడు. వినకపోవడంతో ఆమెపై కాల్పులు జరిపాడు. గురితప్పడంతో ఆమె స్వల్ప గాయాలతో బయటపడిన ఘటన దేశ రాజధానిలో జరిగింది.
ఢిల్లీలోని మంగళ్పురికి చెందిన మోనిక, మోహిత్‌లకు ఏడాది క్రితం వారికి పెండ్లయింది. అతడు నిరుద్యోగి. ఆమె ఎంకామ్ చదువుతున్నది. అయితే కొద్దిరోజులకే ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో ఆమె తన తల్లిగారింట్లో ఉంటున్నది. ఇద్దరి ఇళ్లు సమీపంలోనే ఉండటంతో తరచూ అతడు వారింటికి వెళ్లి లొల్లిపెడుతుండేవాడు. విసుగుచెందిన ఆమె బుధవారం ఉదయం 9 గంటలకు పోలీసులకు ఫోన్ చేసి.. తన భర్త తనను వేధిస్తున్నాడని, తరచూ గొడవ పడుతున్నాడని చెప్పింది. ప్రస్తుతం తాను బయట ఉన్నానని చెప్పి, మధ్యాహ్నం 2 గంటలకు పోలీస్ స్టేషన్లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది.
ఈ నేపథ్యంలో విచారణ నిమిత్తం పోలీసులు మోహిత్‌కు ఫోన్ చేశారు. తాను బయట ఉన్నానని, సాయంత్రం స్టేషన్‌కు రాగలనని చెప్పాడు. అయితే అతడు నేరుగా అత్తగారింటికి వెళ్లి మోనికతో గొడవకు దిగాడు. కేసు ఉపసంహరించుకోవాలని లొల్లిచేశాడు. ఆమె వినకపోవడంతో ఆమెపై తుపాకీతో కాల్పులు జరిపాడు. అయితే అది గురితప్పడంతో ఆమె బతికిపోయింది. దీనికి సంబంధించి పోలీసులకు సమాచారం అందడంతో వారు మోనిక ఇంటికి వచ్చారు. అప్పటికీ మోహిత్ చేతిలో తుపాకీ ఉన్నది. పోలీసులను చూసి అక్కడి నుంచి పారిపోతున్న అతన్ని స్థానికుల సహాయంతో పట్టుకున్నామని డీసీపీ పర్విందర్ సింగ్ చెప్పారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆమెను దవాఖానకు తరలించామని, మోహిత్‌ను అరెస్టు చేసి, వివిధ సెక్షన్ల కింది కేసు నమోదుచేశామన్నారు.