Arvind Kejriwal | ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్‌ను మంజూరు చేసిన విషయం తెలిసిందే. బెయిల్ బాండ్‌ను రౌస్ అవెన్యూ కోర్టుకు సమర్పించగా.. ఆమోదించింది. కేజ్రీవాల్‌ను విడుదల చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కేజ్రీవాల్ తరఫు న్యాయవాదులు రూ.10 లక్షల బెయిల్ బాండ్, అంతే మొత్తానికి ఇద్దరు పూచీకత్తును కోర్టుకు సమర్పించడంతో ప్రత్యేక న్యాయమూర్తి రాకేశ్ సియాల్ ఉత్తర్వులు జారీ చేశారు. కేజ్రీవాల్‌ను ముందస్తుగా విడుదల చేసేందుకు ప్రత్యేక మెసెంజర్ ద్వారా విడుదల వారెంట్ పంపాలన్న డిఫెన్స్ లాయర్ల అభ్యర్థనను సైతం కోర్టు అంగీకరించింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్టయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట లభించింది.
సుప్రీంకోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. జూన్ నెలాఖరులో కేజ్రీవాల్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. దాదాపుగా విచారణ ముగింపు దశకు చేరుకున్నామని సీబీఐ కోర్టుకు తెలిపింది. కేసులో నిందితులను విచారించేందుకు రిమాండ్ తప్పదని పేర్కొంది. మద్యం పాలసీ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌ను మార్చి 21న ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సీఎం కేజ్రీవాల్ ప్రస్తుతం సీబీఐ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. తాజాగా ఈ కేసులోనూ సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన కొద్దిగంటల్లోనే తిహార్ జైలు నుంచి విడుదలవనున్నారు.