న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై తప్పుడు అవినీతి ఆరోపణలు చేస్తున్న ఆ పార్టీ నేతలపై పరువు నష్టం దావా వేస్తానని ఆయన హెచ్చరించారు. ఆప్ ఎమ్మెల్యేలు అతిషి, సౌరబ్ భరద్వాజ్ సహా మరికొందరు ఆప్ నేతలు.. తన పరువును తీసేలా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
పాత కరెన్సీ నోట్ల రద్దు సందర్భంగా 2016లో ప్రస్తుత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఖాదీ సంస్థ చైర్మన్‌గా ఉన్నారు. ఆ సమయంలో రూ.1400 కోట్ల విలువైన నిషేధిత కరెన్సీ నోట్లను మార్పిడి చేయించాలంటూ ఇద్దరు ఉద్యోగులపై సక్సేనా ఒత్తిడి తీసుకొచ్చినట్లు ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను సక్సేనా కొట్టి పారేశారు. ఆప్ నేతలు ఊహాజనిత ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
ఎదురి వారిపై తప్పుడు ఆరోపణలు చేయడం, వారు రుజువులు చూపించాలని గట్టిగా నిలబడితే క్షమాపణలు చెప్పడం కేజ్రివాల్‌కు, ఆయన పార్టీ సహచరులకు అలవాటేనని సక్సేనా ఎద్దేవా చేశారు.