IIT Delhi : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ – ఢిల్లీ (IIT-Delhi) మైక్రాన్ టెక్నాలజీ (Micron Technology) కంపెనీతో కీలక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ మేరకు ఐఐటీ ఢిల్లీ ఒక ప్రకటన చేసింది. ఎలక్ట్రానిక్ మెటీరియల్స్ (electronic materials), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పై అధునాతన పరిశోధనను ప్రోత్సహించడం కోసం ఈ భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ఐఐటీ ఢిల్లీ తెలిపింది.
ఐఐటీ ఢిల్లీ కార్పొరేట్ రిలేషన్స్ కార్యాలయం ద్వారా ఈ భాగస్వామ్యం ఏర్పడింది. విద్యా పరిశోధనకు, వాస్తవ ప్రపంచ పారిశ్రామిక అవసరాలకు మధ్య సంబంధాన్ని బలోపేతం చేయడం ఈ భాగస్వామ్యం లక్ష్యం. ముఖ్యంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న సెమీకండక్టర్ రంగంలో ఈ భాగస్వామ్యం బాగా పనిచేయనుంది. సెమీకండక్టర్స్ తయారీ రంగంలో ప్రధాన సవాళ్లను పరిష్కరించడానికి ఆధునిక సాంకేతికత, శాస్త్రీయ జ్ఞానాన్ని ఉపయోగించి కొత్త పరిష్కారాలను అభివృద్ధి చేయడంపై ఉమ్మడి ప్రయత్నం ప్రధానంగా దృష్టి సారించనుంది.
రాగి ఆధారిత ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో పగుళ్లను నివారించడానికి పరిశోధకులు ఎలక్ట్రానిక్ మెటీరియ్స్పై పనిచేయడమేగాక, AI – ఆధారిత నాడీ నమూనాలను ఉపయోగిస్తారు. ఈ ప్రయత్నాలు సెమీకండక్టర్ పరికరాల విశ్వసనీయత, పనితీరును మెరుగుపరుస్తాయని ఒక అంచనా. IIT ఢిల్లీలో కార్పొరేట్ రిలేషన్స్ డీన్ ప్రొఫెసర్ ప్రీతి రంజన్ పాండా ఈ భాగస్వామ్యంపట్ల సంతోషం వ్యక్తంచేశారు. ప్రభావవంతమైన పరిశోధన, ఆవిష్కరణలకు తోడ్పడే ‘పరిశ్రమ-విద్యా’ సహకారాలను పెంపొందించడానికి తాము కట్టుబడి ఉన్నామని అన్నారు.
మైక్రాన్ టెక్నాలజీతో తమ అనుబంధం విద్యాపరమైన జ్ఞానం, పారిశ్రామిక నైపుణ్యాల సంపూర్ణ సంగమమని పాండా అన్నారు. ఎలక్ట్రానిక్ మెటీరియల్స్, AI-ఆధారిత మోడలింగ్‌లో పురోగతిని తాజా భాగస్వామ్యం ప్రోత్సహిస్తుందని, సెమీకండక్టర్ పరిశ్రమలో క్లిష్టమైన సవాళ్లను పరిష్కరిస్తుందని చెప్పారు. ఐఐటీ ఢిల్లీతో మైక్రాన్ టెక్నాలజీ భాగస్వామ్యం అత్యాధునిక AI నమూనాలు, క్రిస్టల్ ప్లాస్టిసిటీ ఫ్రేమ్‌వర్క్‌లను అభివృద్ధి చేయడంలో తోడ్పడుతుందని, సెమీకండక్టర్ టెక్నాలజీ భవిష్యత్తుపట్ల మా నిబద్ధతను బలోపేతం చేస్తుందని మైక్రాన్ టెక్నాలజీ వైస్ ప్రెసిడెంట్ గుర్తేజ్ ఎస్ సంధు అన్నారు.