న్యూఢిల్లీ, జూన్ 11: ఇప్పటికే వడగాల్పులు, నీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న దేశ రాజధాని ఢిల్లీ ప్రజలపై మరో పిడుగు పడింది. మంగళవారం మధ్యాహ్నం నుంచి నగరవాసులకు కరెంట్ కోతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని మండోలాలో ఉన్న పవర్‌గ్రిడ్‌లో అగ్నిప్రమాదం సంభవించడంతో నగరానికి విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. మండోలా పవర్ గ్రిడ్ నుంచి ఢిల్లీకి 1,500 మెగావాట్ల విద్యుత్తు సరఫరా అవుతుంది. పవర్ గ్రిడ్ విఫలమవడంతో నగరంలోని పలు ప్రాంతాల ప్రజలు కరెంట్ కోతలు ఎదుర్కొంటున్నారని ఢిల్లీ మంత్రి ఆతిశీ వెల్లడించారు. ఢిల్లీలో కరెంట్ కోతల నేపథ్యంలో తమ ఏరియాల్లో చాలా సమయం నుంచి కరెంట్ లేదంటూ పలువురు నగరవాసులు సామాజిక మాధ్యమాల వేదికగా పోస్టులు చేశారు.
ఢిల్లీలో ఉష్ణోగ్రతలు ఇప్పటికే 40 డిగ్రీల సెల్సియస్ కంటే అధికంగా నమోదవుతున్న క్రమంలో తాజా పరిణామం నగరవాసులకు మరింత ఇబ్బందికరంగా మారింది. ‘ఈరోజు మధ్యాహ్నం 2.11 గంటల నుంచి ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో భారీగా కరెంట్ కోతలు ఉన్నాయి. నగరానికి 1,500 మెగావాట్ల విద్యుత్తు సరఫరా చేసే మండోలా పవర్‌గ్రిడ్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ నేపథ్యంలో ఇతర విద్యుత్తు సరఫరా వనరులకు లింక్ చేస్తున్నాం’ అని ఆతిశీ పేర్కొన్నారు.
దేశ విద్యుత్తు సరఫరా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుందని, తాజా సమస్యపై మాట్లాడేందుకు కొత్త విద్యుత్తు మంత్రి అపాయింట్మెంట్ కోరుతానని తెలిపారు. జాతీయ స్థాయి పవర్‌గ్రిడ్ విఫలం కావడం, విద్యుత్తు మౌలిక సదుపాయాలు నిలిచిపోవడం ఆందోళనకరమని ఆతిశీ అన్నారు. 8,000 మెగావాట్ల విద్యుత్తు డిమాండ్‌కు చేరిన సమయంలో కూడా ఇలాంటి సమస్య తలెత్తలేదని, జాతీయస్థాయిలో మౌలిక సదుపాయాల వైఫల్యం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని కేంద్రాన్ని విమర్శించారు.