న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీలో గాలి కాలుష్యం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఎయిర్ ప్యూరిఫయర్స్పై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ని ఎందుకు తాత్కాలికంగా మినహాయించలేకపోతున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్టు బుధవారం ప్రశ్నించింది. ప్రభుత్వం నుంచి సూచనలు తీసుకుని బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు తెలియజేయాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది. ఢిల్లీలోని గాలి కాలుష్యం తీవ్రంగా ఉన్నందు వల్ల ఎయిర్ ప్యూరిఫయర్లను మెడికల్ డివైసెస్గా వర్గీకరించాలని కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ అడ్వకేట్ కపిల్ మదన్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపింది. ధర్మాసనం స్పందిస్తూ, మనం రోజుకు 21,000 సార్లు శ్వాస తీసుకుని, వదిలిపెడతామని, దీనివల్ల జరిగే హానిని లెక్కగట్టాలని చెప్పింది. ఎయిర్ ఎమర్జెన్సీ సమయంలో కూడా ఎయిర్ ప్యూరిఫయర్లపై జీఎస్టీ 18 శాతం ఎందుకు కొనసాగుతున్నదని కేంద్రాన్ని నిలదీసింది. తక్షణమే ఈ పన్నును ఎందుకు తగ్గించడం లేదని ప్రశ్నించింది. స్పందించడానికి సమయం కావాలని ప్రభుత్వం కోరినపుడు, ధర్మాసనం స్పందిస్తూ, “సరైన సమయం అంటే ఏమిటి? వేలాది మంది మరణించినపుడా? ఈ నగరంలోని ప్రతి పౌరునికీ పరిశుభ్రమైన గాలి కావాలి, మీరు దానిని ఇవ్వలేకపోతున్నారు. కనీసం మీరు చేయగలిగినది వారికి ఎయిర్ ప్యూరిఫయర్లు అందుబాటులో ఉంచడం” అని తెలిపింది.