న్యూఢిల్లీ: 2023 డిసెంబర్లో పార్లమెంట్‌లోని లోక్‌సభలోకి ఇద్దరు ప్రవేశించి భద్రతా ఉల్లంఘన(Parliament Security Breach)కు పాల్పడిన విషయం తెలిసిందే. ఆ కేసులో నిందితులు నీలం ఆజాద్, మహేశ్ కుమావత్‌లకు ఢిల్లీ హైకోర్టు ఇవాళ బెయిల్ మంజూరీ చేసింది. జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్, హరీశ్ విద్యనాథన్ శంకర్‌లతో కూడిన ధర్మాసనం నీలం, మహేశ్‌లకు ఊరట కల్పించింది. ఇద్దరికీ 50వేల పూచీకత్తుపై బెయిల్ కల్పించారు. పార్లమెంట్ దాడి ఘటన గురించి మీడియాకు ఇంటర్వ్యూలో ఇవ్వరాదు అని కోర్టు ఆదేశించింది. సోషల్ మీడియాలో పోస్టులు కూడా చేయవద్దు అని ధర్మాసనం పేర్కొన్నది. ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్‌ను సవాల్ చేస్తూ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు.
2001 నాటి పార్లమెంట్ దాడి ఘటనను వ్యతిరేకిస్తూ.. కొందరు నిరసనకారులు పార్లమెంట్ బిల్డింగ్‌లోకి ప్రవేశించారు. లోక్‌సభ సమావేశాలు జరుగుతున్న సమయంలో స్మోక్ కానిస్టర్లను స్ప్రే చేశారు. విజిటర్స్ గ్యాలరీ నుంచి కిందకు దూకి స్మోక్ స్ప్రే చేశారు. ఆజాద్‌ను 2023, డిసెంబర్ 13వ తేదీన అరెస్టు చేశారు. అతనితో పాటు సాగర్ శర్మ, మనోరంజన్ డీ, అన్మోల్ షిండేలను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఘటన జరిగిన రోజున ఆజాద్, షిండేలు పార్లమెంట్ ఆవరణలో నిరసన చేపట్టారు. లోక్‌సభ చాంబర్లోకి శర్మ, మనోరంజన్ ప్రవేశించారు. ఈ కుట్రలో భాగమైన ప్రధాన నిందితుడు లలిత్ జా, మరో నిందితుడు మహేశ్ కుమావత్‌లను కూడా పోలీసులు అరెస్టు చేశారు.