Monkeys | న్యూఢిల్లీ, జనవరి 3: ఢిల్లీ శాసన సభను కోతుల బెడద పట్టి పీడిస్తున్నది. దీంతో కోతులను భయపెట్టే కొండముచ్చు(లంగూర్)లాగా శబ్దాలు చేసేందుకు మిమిక్రీ కళాకారులను నియమించాలని విధాన సభ ప్రణాళిక సిద్ధం చేసినట్టు అధికారులు శుక్రవారం తెలిపారు. నిత్యం డజన్ల కొద్దీ కోతులు విధానసభ కాంప్లెక్స్, దాని పరిసర ప్రాంతాల్లో తిష్ఠ వేస్తున్నాయి. అవి నిత్యం తీగలపై గెంతుతూ పాడు చేయడమే కాక, డిష్ యాంటెన్నాలను పగులగొడుతున్నాయి. తరచూ విధానసభ ప్రాంగణంలోకి ప్రవేశిస్తుండటం వల్ల సభ్యులు, సందర్శకుల భద్రతకు భంగం వాటిల్లుతున్నది. దీంతో కొండ ముచ్చులను అనుకరిస్తూ మిమిక్రీ చేసే వ్యక్తులను నియమించడానికి పీడబ్ల్యూడీ ఆధ్వర్యంలో టెండర్లు పిలిచారు.
సాధారణంగా కొండముచ్చు ఉన్న చోటికి రావడానికి కోతులు భయపడతాయి. కోతులకు భౌతికంగా ఎలాంటి హానీ కలుగకుండా చేసేందుకే ఇలా మిమిక్రీ చేసి వాటిని భయపెట్టే వ్యక్తులను నియమిస్తున్నట్టు అధికారులు తెలిపారు. అలాగే కోతులను తరిమి కొట్టేందుకు కొండ ముచ్చుతో ఒక నిపుణుడిని కూడా రప్పిస్తున్నామన్నారు. తొలుత పెద్ద పెద్ద కొండముచ్చుల కటౌట్లు ఏర్పాటు చేసి కోతులను భయపెట్టడానికి ప్రయత్నించామని, అయితే అది కొద్ది కాలమే పనిచేసిందని, తర్వాత కోతులు ఆ కటౌట్ల పైకి ఎక్కి వాటిని నాశనం చేయడం ప్రారంభించాయని వారు చెప్పారు.