విన్నావా ఎపుడయినా
గొంతులో తారట్లాడే శబ్దాల అర్థాల్ని
మాటల అర్థాల కోసం వెతికే మౌనాన్ని..
చూసావా ఎపుడయినా
తెల్లని కాగితంపై చీమల్లా బారులుతీరిన అక్షరాల్ని
కన్నావా ఎపుడయినా
వంపులు తిరిగిన అక్షరాల సోయగాల్ని
అవి మోస్తున్న భావాల సరాగాల్ని..
కన్నావా ఎపుడయినా నిన్నటి సముద్రాల్ని మోస్తున్న
ఇవ్వాల్టి సూర్యోదయాల్ని
అనుభవించావా ఎపుడయినా
పగటి ఎండ పరిమళాల్ని నింపుకుని
వెచ్చటి గాలిలో చల్లని హొయలు పోతున్న సాయంకాలాన్ని..
చూసావా ఎపుడయినా
ఒంటరితనం గుంపులోకి పరిణామం చెందడాన్ని
గుంపు ఒంటరితనంలోకి ఘనీభవించడాన్ని..
తెలిసిందా ఎపుడయినా
రాత్రి నిద్ర ఉదయపు మెలకువలోకి
పగటి శ్రమ రాత్రి నిద్రలోకి పరివర్తన చెందడం!
గమనించావా ఎపుడయినా
కవితలో అర్థం లేనితనాన్ని
వెతికావా ఎపుడయినా
అర్థం లేనితనంలో కవిత్వాన్ని!
ఎక్కడ మొదలయ్యామో
మరిచిపోయాం కావాలనే..
ఎక్కడికి వెళ్ళాలో దారి
తప్పిపోయాం తెలియకనే..
చౌరస్తాలో కాటగల్సి పోయాం!
చూసావా చిత్రంగా ముందు నిలుచున్న అద్దం
అబద్ధం చూపుతోంది..
లోన వెలిగించుకున్న దీపం కొడిగట్టుతోంది..
గమనించావా
చీకటి వెలుగుల నిరంతర యానంలో
బతుకు తెరచాప రెప రెప లాడుతోంది..
నీటి అలలపై పడవింకా పరుగెత్తాల్సే వుంది..!
వారాల ఆనంద్
9440501281