న్యూఢిల్లీ: తమిళనాడుకు చెందిన శ్రీసన్ ఫార్మసిట్యుకల్స్ కంపెనీ ఉత్పత్తి చేస్తున్న కోల్డ్రిఫ్ దగ్గముందు(Coldrif Cough Syrup) అమ్మకాలపై తాజాగా ఢిల్లీ సర్కారు నిషేధాన్ని ప్రకటించింది. కోల్డ్రిఫ్ సిరప్ బాటిళ్లను పంపిణీ చేయరాదు అని, అమ్మరాదు అని ఢిల్లీ ప్రభుత్వం బ్యాన్ విధించింది. చిన్నపిల్లలకు వాడే కోల్డ్రిఫ్ దగ్గుమందులో డైఇథనాల్ గ్లైకాల్(46.28% w/v) అనే హానికరమైన రసాయనం ఉన్నట్లు గుర్తించారు. మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాలో కోల్డ్రిఫ్ దగ్గుమందు వాడడం వల్ల సుమారు 22 మంది చిన్నపిల్లలు మృతిచెందిన విషయం తెలిసిందే.
ఆ ఘటన చోటుచేసుకున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు ఇప్పటికే ఆ మందును బ్యాన్ చేశాయి. సిరప్‌ను వాడడం వల్ల మధ్యప్రదేశ్‌లో చిన్నారులు కిడ్నీ ఫెయిల్యూర్‌తో బాధపడ్డారు. డైఇథనాల్ గ్లైకాల్ అధిక మోతాదులో ఉందని, ఆ హానికరమైన రసాయనం వల్ల కిడ్నీలు దెబ్బతినే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. డీఈజీ వల్ల కడుపు నొప్పి, వాంతులు, డయేరియా, మూత్ర విసర్జనలో ఇబ్బంది, తలనొప్పి, మానసిక స్థితి ఆందోళకరంగా మారేటువంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి.
చిన్న పిల్లలో ఈ మందు వల్ల ముఖ్యంగా కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉన్నది. దగ్గు మందులు ఉత్పత్తి చేస్తున్న అన్ని ఫార్మసీ కంపెనీలకు ఢిల్లీ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. మందుల ఉత్పత్తికి వాడే ముడిసరుకులను పరీక్షించాలని తన ఆదేశాల్లో పేర్కొన్నది. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న కెమిస్టులు, సప్లయర్ల నుంచి ర్యాండమ్‌గా శ్యాంపిళ్లను సేకరిస్తున్నది.