Delhi excise policy case : ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో జైలుకు వెళ్లి, లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం మధ్యంతర బెయిల్‌పై బయటికి వచ్చిన అర్వింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని కోరుతూ.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కోర్టులో పిటిషన్ వేసింది. కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ గడువు ముగియనున్న జూన్ రెండో తేదీలోపే ఆయన జ్యుడీషియల్ కస్టడీని రెండు వారాలు పొడిగించాలని ఈడీ తన పిటిషన్లో కోరింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ తన పిటిషన్‌ను దాఖలు చేసింది.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈ ఏడాది మార్చి 21 ఈడీ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసింది. పలు దఫాలుగా ఈడీ కస్టడీలో విచారణ ఎదుర్కొన్న అనంతరం ఆయనను తీహార్‌జైలుకు పంపించారు. అయితే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తన పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించేందుకు బెయిల్ ఇవ్వాలని కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
కేజ్రీవాల్ పిటిషన్‌పై విచారణ జరిపిన అనంతరం సుప్రీంకోర్టు ఆయన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే కేజ్రీవాల్ ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు బెయిల్ కావాలని అభ్యర్థించగా.. కోర్టు మాత్రం ఏడో దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ మరుసటి రోజు వరకు బెయిల్ మంజూరు చేసింది. జూన్ 2 తేదీన బెయిల్ గడువు ముగియగానే జూన్ 3న జైలులో లొంగిపోవాలని ఆదేశించింది.