Delhi Election Analysis | దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా నాలుగోసారి విజయం సాధించాలన్న అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీని బీజేపీ దెబ్బకొట్టింది. దాదాపు 26 సంవత్సరాల తర్వాత బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకున్నది. ఇప్పటికే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ సైతం ఎన్నికల్లో బీజేపీదే విజయమని స్పష్టం చేశాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ.. బీజేపీ సత్తా చాటుతున్నది. దాదాపు 27 సంవత్సరాల కిందట బీజేపీ నేత సుష్మా స్వరాజ్ 52 రోజులు ఢిల్లీ ముఖ్యమంత్రిగా కొనసాగారు. అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా తర్వాత అతిషి.. ఢిల్లీ మూడో మహిళా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. కేజ్రీవాల్ రాజీనామా అనంతరం.. ఢిల్లీ ఎన్నికల స్వరూపం మారిపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ విధానాలపై గళం విప్పడంతో పాటు దానికి తోడు ఆప్‌కు దీటుగా బీజేపీతో పాటు కాంగ్రెస్ సైతం అభ్యర్థులను రంగంలోకి దింపింది. అయితే, బీజేపీ గెలుపు.. ఆప్ ఓటమికి పలు కారణాలున్నాయని రాజకీయ విశేష్లకులు భావిస్తున్నారు. ఇవే ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ గెలుపు అవకాశాలను దెబ్బకొట్టినట్లుగా అంచనా వేస్తున్నారు. ఇంతకీ ఆ కారణాలేంటో ఓసారి తెలుసుకుందాం..!
ఢిల్లీలో కేజ్రీవాల్ వరుసగా మూడుసార్లు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆయన ప్రజాకర్షక పథకాలతో వరుసగా మూడోసారి ఢిల్లీ పీఠాన్ని నిలబెట్టుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు జైలుపాలయ్యారు. ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టయి జైలుకు వెళ్లారు. అరెస్ట్ అయిన సమయంలో సీఎం పదవికి రాజీనామా చేయని కేజ్రీవాల్.. గతేడాది సెప్టెంబర్‌లో తన పదవికి రాజీనామా చేశారు. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు సత్యేందర్ జైన్ మనీలాండరింగ్ కేసులో జైలుకు వెళ్లారు. అదే సమయంలో మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సైతం మద్యం పాలసీ కేసులో అరెస్ట్ జైలు జీవితం గడిపారు. రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ సైతం జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేతలు అందరూ జైలుకు వెళ్లడం కాస్త ఆ పార్టీకి కాస్త ఇబ్బందికరంగా మారింది. ముఖ్యమైన విషయం ఏంటంటే.. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టి అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్.. అదే అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్నారు.
ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ప్రజలకు భారీగా తాయిలాలు ప్రకటించింది. ఉచిత విద్యుత్, ఉచిత నీటి సరఫరా పథకాలు ఆమ్ ఆద్మీ పార్టీకి ఆదరణ లభించిందింది. గతంలో బీజేపీ ఉచిత పథకాలకు వ్యతిరేకంగా గళం విప్పింది. కేజ్రీవాల్ దాన్ని సద్వినియోగం చేసుకొని దేశవ్యాప్తంగా ఉచిత విద్యుత్‌తో పాటు పలు పథకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సారి ఎన్నికల్లో ఆమ్ తరహాలోనే బీజేపీ సైతం ఉచిత పథకాలతో ఓటర్లకు గాళం వేసింది. కాంగ్రెస్ పార్టీ సైతం అదే ట్రిక్ని ప్లే చేసింది. బీజేపీ గర్భిణులకు ఆర్థిక సాయం, రూ.500కే గ్యాస్ సిలిండర్, వృద్ధులకు రూ.2500 పెన్షన్, ఆయుష్మాన్ భారత్, అటల్ క్యాంటిన్ కింద రూ.5కే భోజనం తదితర పథకాలను ప్రకటించింది. గతంలో ఉచిత పథకాల జోలికి వెళ్లిన బీజేపీ.. ఈ సారి భిన్నంగా భారీ తాయిళాలు ప్రకటించింది. కాంగ్రెస్ సైతం భారీగానే ఎన్నికల్లో వరాలు ప్రకటించింది. ఫలితంగా ఎన్నికల్లో ఆప్‌కు కాస్త ఇబ్బందికరంగా మారింది.
ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ శీష్ మహల్ అంశాన్ని లేవనెత్తింది. ఢిల్లీ ముఖ్యమంత్రి నివాసం కోసం విలాసవంతమైన భవనం నిర్మాణం కోసం కోట్లాది రూపాయలు వెచ్చించడంపై బీజేపీ ప్రశ్నలు లేవనెత్తింది. ఈ విషయంలో బీజేపీ పోస్టర్లు విడుదల చేసి కేజ్రీవాల్ సర్కారును కార్నర్ చేసింది. కాంగ్రెస్ కూడా ఈ అంశాన్ని లేవనెత్తింది. దేశ పార్లమెంట్‌లోనూ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు నేతలు ఈ అంశంపై ఆప్‌ను కార్నర్ చేసేందుకు ప్రయత్నించారు.
యయునా నది స్వచ్ఛతతో పాటు నీటి ఎద్దడి తదితర సమస్యలు సైతం ఆమ్ ఆద్మీ పార్టీని చుట్టుముట్టాయి. గతంలో అధికారంలోకి కేజ్రీవాల్, ఆప్ నేతలు అందరూ యమునా అంశాన్ని లేవనెత్తారు. తాము అధికారంలోకి వస్తే యమునా నదిని శుభ్రంగా మారుస్తామని నేతలు ప్రకటించారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఆప్‌కు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇస్తారు. పదేళ్లు అధికారంలో ఉన్నా యమునా నది శుభ్రతపై దృష్టి పెట్టలేకపోయింది. ఈ సారి ఎన్నికల ప్రచారానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఢిల్లీకి వచ్చి కేజ్రీవాల్‌కు సవాల్ విసిరారు. ఆమ్ ప్రభుత్వం యమునా నదిని డంప్ యార్డ్‌లా మార్చిందని.. తాను కుంభమేళా సందర్భంగా త్రివేణి సంగమంలో మంత్రులతో కలిసి స్నానం చేశానని.. కేజ్రీవాల్ తన మంత్రులతో కలిసి యమున నదిలో స్నానం చేస్తారా? అంటూ సవాల్ విసిరారు. ఆ తర్వాత కేజ్రీవాల్ యమున నీరంతా కలుషితమైందని.. దీనికి హర్యానా ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైనీ యమునా నీటిని తాగి చూపించారు. ఇవే కాకుండా ఢిల్లీ రోడ్లు, వర్షాకాలంలో వరద సమస్యలపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రభుత్వాన్ని చుట్టుముట్టాయి.
ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవాలనే కసితో ఉన్నది. ఇందులో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీని అన్ని రకాలుగా టార్గెట్ చేస్తూ వచ్చింది. ఆమ్ ఆద్మీని డిజాస్టర్‌గా పేర్కొంటూ ఎన్నికల నినాదాన్ని బీజేపీ రూపొందించి అమలు చేసింది. ఎన్నికల సభల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆప్ ప్రభుత్వాన్ని డిజాస్టర్‌గా అభివర్ణించారు. కేజ్రీవాల్ సర్కారు అన్ని రంగాల్లో విఫలమైంది ఆరోపిస్తూ.. బీజేపీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. ఈ ఎన్నికల నినాదంతో బీజేపీ అడుగడుగునా కేజ్రీవాల్‌ను, ఆయన పార్టీని టార్గెట్ చేసింది. ఢిల్లీలో ఆయుష్మాన్ భారత్ పథకం అమలు చేయకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. పథకంతో కలిగే ప్రయోజనాలను బీజేపీ ఢిల్లీకి ప్రజలకు వివరించింది. ఆప్ వైఖరి డిజాస్టర్‌గా బీజేపీ అభివర్ణించింది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటును గెలువలేకపోయింది. కాంగ్రెస్‌కు 2015 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 9.7శాతం ఓట్లు సాధించింది. ఇక 2020లో అత్యల్పంగా 4.3శాతం ఓట్లు పోలయ్యాయి. ఈ సారి 6.62శాతం వరకు ఓట్లు వచ్చాయి. అయితే, గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీకి ఐక్యంగా బీజేపీకి సవాల్ విసిరాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రెండు పార్టీలు తెగదెంపులు చేసుకున్నాయి. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు స్వల్పంగా ఓట్ల శాతం పెరగ్గా.. ఫలితాలపై ఈ ప్రభావం కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్‌కు పెరిగిన ఓటింగ్‌తో ఆప్ విజయ అవకాశాలను కాస్త దెబ్బకొట్టినట్లు కనిపిస్తుందని పేర్కొంటున్నారు.