న్యూఢిల్లీ : బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు కోర్టు సమన్లు జారీ చేసింది. వచ్చే నెల 26 న కోర్టు ఎదుట హాజరుకావాలని పాటియాలా కోర్టు ఆదేశించింది. రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నిందితురాలుగా ఇటీవలనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పేర్కొన్నది. ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను పాటియాలా కోర్టు విచారించి ఈ మేరకు జాక్వెలిన్‌కు సమన్లు జారీ చేసింది.
రూ.215 కోట్ల దోపిడీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను నిందితురాలిగా పేర్కొన్నది. ఆగస్టు నెల ప్రారంభంలో ఆమెపై ఈడీ చార్జిషీట్ కూడా దాఖలు చేసింది. బలవంతంగా వసూలు చేసిన సొమ్ములో జాక్వెలిన్ లబ్ధిదారురాలుగా ఈడీ గుర్తించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సుఖేష్ చంద్రశేఖర్ దోపిడీదారుడని ఆమెకు తెలుసునని ఈడీ విశ్వసిస్తున్నది. వీడియో కాల్స్‌లో సుకేష్ చంద్రశేఖర్‌తో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నిరంతరం టచ్‌లో ఉన్నట్లు కీలక సాక్షులు, నిందితుల వాంగ్మూలాలు వెల్లడించాయి. శ్రీలంకలో జన్మించిన ఈ నటికి విలువైన బహుమతులు ఇచ్చినట్లు సుకేష్ అంగీకరించాడు.
సుకేష్ చంద్రశేఖర్ గతంలో ఆమెకు రూ.10 కోట్ల విలువైన బహుమతులు పంపినట్లు ఈడీ గుర్తించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ ఇప్పటివరకు జాక్వెలిన్‌కు చెందిన రూ.7 కోట్లకు పైగా విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. సుకేష్ చంద్రశేఖర్‌పై వివిధ రాష్ట్రాలు, కేంద్ర ఏజెన్సీల్లో 32 కు పైగా క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి. వీటిని సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఆదాయపు పన్ను శాఖలు దర్యాప్తు చేస్తున్నాయి.