న్యూఢిల్లీ: ఆప్ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్కుమార్కు కోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కోర్టు సోమవారం తిరస్కరించింది. ఈ కేసులో ఇరు వర్గాల వాదనలు విన్న మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ గౌరవ్ గోయల్ బిభవ్కుమార్కు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించారు. కోర్టుకు హాజరైన ఎంపీ స్వాతిమలివాల్, విచారణ సమయంలో బిభవ్‌కుమార్ తరఫు న్యాయవాదుల మాటలకు కన్నీటి పర్యంతమయ్యారు. ఢిల్లీ సీఎం అధికారిక నివాసంలో సీసీటీవీ కవరేజ్ లేని ప్రదేశాన్ని ఎంచుకొని, తనపై దాడి జరిగిందన్న తప్పుడు ఆరోపణలు ఆమె చేస్తున్నారని, ముందస్తు ప్రణాళికతో ఆమె ఇదంతా చేస్తున్నదని నిందితుడి తరఫు న్యాయవాదులు వాదించారు. దీంతో ఆప్ ట్రోల్ ఆర్మీ తనపై దుష్ప్రచారం చేస్తున్నదని మలివాల్ వాపోయారు. బిభవ్ బెయిల్‌పై జైలు నుంచి బయటకువస్తే.. తన ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని కోర్టుకు తెలిపారు.